పాకిస్తాన్ పై వైమానిక దాడులు చేశాం: భారత్
భారత్ వైపు పాకిస్తాన్ బలగాలు దూసుకువస్తున్నాయి, ఏదైన దుస్సాహసం చేస్తే తగిన బుద్ధి చెపుతామన్న ఆర్మీ;
By : The Federal
Update: 2025-05-10 05:54 GMT
పాకిస్తాన్ లోని కీలక వైమానిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపినట్లు భారత్ ప్రకటించింది. దానవ దేశం నిన్న రాత్రి నుంచి దేశంపైకి డ్రోన్లు, లాయిటరింగ్ అమ్యూనేషన్, క్షిపణులతో దాడులకు పాల్పడిందని, వాటిని సాయుధ బలగాలు విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది.
అర్థరాత్రి 1.40 తరువాత దాడులు తీవ్రతరం చేసిందని తెలిపింది. పాక్ పై చేస్తున్న దాడులకు సంబంధించి విదేశాంగ, రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టే విధంగా దాడులు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడారు.
పాకిస్తాన్, భారత్ లోని 26 ప్రాంతాలలో దాడులకు ప్రయత్నించిందని అన్నారు. శ్రీనగర్ మొదలు దేశంలోని పశ్చిమ సరిహద్దులపై దాడులకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అన్నారు.
బాలిస్టిక్ క్షిపణులతో దేశంలోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా దాడి చేసిందని, వీటిని విజయవంతంగా కూల్చివేసినట్లు చెప్పారు. ఈ దాడులకు సమాధానంగా పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లపై భారత వైమానిక దళం దాడులు చేసిందని, ఆ దేశ మౌలిక సదుపాయాలు, క్షిపణి ప్రయోగకేంద్రాలు, డ్రోన్లు ప్రయోగించే లాంఛర్లను ధ్వంసం చేసినట్లు వింగ్ కమాండర్ ప్రకటించారు.
ఇవి తక్కువ తీవ్రత కలిగిన దాడులని, పాకిస్తాన్ బలగాలు భారత్ వైపు ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్ ఏ మాత్రం దుశ్చర్యలకు దిగిన భారత దళాలు అందుకు సంసిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
భారత ఎయిర్ బేస్ లపై దాడిచేసినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని, అన్ని ఎయిర్ బేస్ లు సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన ఫొటోలు ప్రదర్శించారు. పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.