తత్కాల్ బుకింగ్‌కు OTP తప్పనిసరి..
దురంతో, వందే భారత్ సహా మరో 13 రైళ్లల్లో ఈ విధానం అమల్లోకి..
తత్కాల్(Tatkal) టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది సెంట్రల్ రైల్వే (సీఆర్). డిసెంబర్ 6వ తేదీ నుంచి ఓటీపీ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానం ప్రకారం.. ప్రయాణీకులు బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. అది ఎంట్రీ చేస్తేనే టికెట్ జారీ అవుతాయి. దురంతో, వందే భారత్ సహా మరో 13 రైళ్లల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విధానం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు డిసెంబర్ 5 నుంచే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 1 నుంచే పూణే-హైదరాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు ఈ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టిక్కెట్లకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుందని CR ఒక ప్రకటనలో తెలిపింది. పారదర్శకతను పెంపొందించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, నిజమైన ప్రయాణీకులు మాత్రమే తత్కాల్ కోటాను పొందడమే లక్ష్యంగా ఈ విధానం తీసుకువచ్చినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది.