ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) ప్రక్రియను ఎక్కువమంది BLOలతో చేయించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) కేంద్ర ఎన్నికల సంఘాన్ని (E.C) ఆదేశించింది. S.I.R జరుగుతోన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో B.L.Oలుగా విధులు నిర్వహిస్తోన్న కొంతమంది ఉపాధ్యాయులు అనారోగ్యంతో చనిపోయారు. అధిక పని ఒత్తిడి కారణంగానే చనిపోయారన్నది వారి కుటుంబసభ్యుల వాదన.
ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో పని పూర్తి చేయని B.L.Oలపై చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ.. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. టీవీకే తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలను వినిపించారు. విధులను నిర్వర్తించడంలో విఫలమైన BLOలపై ఎన్నికల అధికారులు FIRలు నమోదు చేస్తున్నారని, పని ఒత్తిడి కారణంగా గుజరాత్‌లో ఇద్దరు అసిస్టెంట్ బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) గుండెపోటుతో మరణించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శంకరనారాయణన్ వాదనలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చితో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. S.I.R జరుగుతోన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అదనపు ఉద్యోగులను నియమించాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.