పహల్గాం ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాక్
దాడికి బాధ్యత వహించిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’;
పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ ప్రకటించుకుంది. 26 మంది పర్యాటకులను ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్న ఘటనపై పలు ప్రపంచ దేశాల నుంచి ఖండనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాము నిర్దోషులమని చెబుతున్నా..భారత్ నమ్మడం లేదు. పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా ఉన్న నిషేధిత లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించడమే అందుకు కారణం.
సంబంధం లేదంటూ ప్రకటన..
దాడి జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్.."ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఉగ్రదాడి ఎక్కడి జరిగినా ఖండిస్తున్నాం," అని ఓ టీవీ చానల్‌కి అన్నారు.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. "పర్యాటకుల మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
అయితే పహల్గాం దాడిలో విదేశీ ఉగ్రవాదులు పాల్గొన్నట్టు ప్రారంభ దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. అందులో ఇద్దరు విదేశీయులుగా అనుమానం వ్యక్తమవుతోంది. వీరంతా సైనిక దుస్తుల్లో వచ్చారు.
ఇక ఈ దాడికి కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. "కాశ్మీర్ మా జుగ్యులర్ వెయిన్ (గొంతు నాడీ). అది మాకు ఎంతో ముఖ్యం. కశ్మీరీ సోదరుల పోరాటాన్ని మేము మర్చిపోం," అని ఓ సభలో వ్యాఖ్యానించిన విషయం మరవలేం.
ఈ ఉగ్రదాడిని రష్యా, అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి.