ఉగ్రదాడి ప్రధాన నిందితుడు అదిల్ థోకర్..
మరో ఇద్దరు పాకిస్థానీయులు..;
పహల్గామ్(Pahalgam)లో 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టిన భద్రతా బలగాలు.. ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. దాడిలో మొత్తం ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయుడు కాగా మరో ఇద్దరు పాక్ దేశస్తులు.
అనంతనాగ్(Anantnag) జిల్లా బీజ్బెహారా మండలం గుర్రే గ్రామానికి చెందిన అదిల్ అహ్మద్ థోకర్‌ను ఉగ్రదాడి ప్రధాన నిందితుడి గుర్తించారు. మిగతా ఇద్దరు నిందితులు హషిమ్ ముసా (సులేమాన్) అలీ భాయ్ (తల్హా భాయ్) పాకిస్థానీయులు.
థోకర్ 2018లో విద్యార్ధి వీసాతో పాకిస్థాన్ వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లోనే ఉన్నప్పుడే థోకర్‌లో దేశవిద్రోహ లక్షణాలు కనిపించాయని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. తన గ్రామంలో ఉన్నప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులతో టచ్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 2018లో పాకిస్థాన్‌కు చేరుకున్న థోకర్ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నాడు. అప్పటికీ ఇంటెలిజెన్స్ సంస్థలు అతనిపై కొంతకాలం నిఘా ఉంచాయి. 8 నెలల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయాడు. గ్రామంలో కూడా థోకర్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆ సమయంలో థోకర్ పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
థోకర్ 2024 అక్టోబర్లో పూంఛ్-రాజౌరీ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) దాటి భారత్‌కు తిరిగి వచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రాంతం ఎతైన కొండలు, పొదలు, అడవులతో నిండి ఉండటంతో పెట్రోలింగ్ కూడా పెద్దగా ఉండదు. గతంలో కూడా ఉగ్రవాదులు ఇదే మార్గాన్ని ఎంచుకుని భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత అనంతనాగ్‌కు సమీపంలోని అడవుల్లోగాని, సమీప గ్రామాల్లోగాని దాక్కున్నాడని, అతనితో పాటు మరో పాకిస్థానీ జాతీయుడు కూడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ ప్రాణనష్టాన్ని కలిగించేందుకే బైసారన్ లోయను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
ఐదుగురు ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి పర్యాటకులపై 10 నిమిషాలలోపే మారణహోమానికి పాల్పడినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. నిందితుల పట్టుకోడానికి సహకరించిన వారికి రూ. 20 లక్షల బహుమతి కూడా ప్రకటించారు.
ఏప్రిల్ 25న అదిల్ అహ్మద్ థోకర్, మరో నిందితుడు ఆసిఫ్ షేక్ ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. సోదాలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలు కనిపించడంతో భద్రతా బలగాలు ఇరుగుపొరుగు వారిని దూరప్రాంతానికి తరలించారు.