ఎంఎల్ఏ డౌన్ డౌన్..ఎంఎల్ఏ గో బ్యాక్..స్ధానికుల ఆగ్రహం
పరిస్ధితి సద్దుమణగకపోవటంతో పోలీసులు ఎంఎల్ఏతో మాట్లాడి అక్కడి నుండి పంపేశారు
చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్యకు పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలింది. సోమవారం తెల్లవారి సుమారు 4.45 గంటలకు చేవెళ్ళకు దగ్గరలోని మీర్జాగూడ దగ్గర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును ఎదురుగా స్పీడుగా వస్తున్న కంకర టిప్పర్ బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. ప్రమాదస్ధలంలోనే 16 మంది చనిపోగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటు మిగిలిన వారు మరణించారు. టిప్పర్లోని కంకరంతా బస్సులోని ప్రయాణీకుల మీదపడిపోవటంతో ఊపిరి ఆడక కొందరు చనిపోయారు. ప్రమాదం జరగ్గానే స్ధానికంగా ఉన్న కొందరు సహాయక చర్యల్లోకి దిగారు. అలాగే పోలీసులకు, అంబులెన్సులకు కూడా స్ధానికులే సమాచారం అందించారు.
ప్రమాదం జరగిన విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ కాలే యాదయ్య సుమారు 11 గంటలకు ప్రమాదస్ధలానికి చేరుకున్నారు. ఎంఎల్ఏని చూడగానే స్ధానికులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సంవత్సరాల తరబడి రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటు తీవ్రంగా మండిపోయారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎంఎల్ఏనే కారణమంటు యాదయ్యపై అందరు రెచ్చిపోయారు. ఎంఎల్ఏ గో బ్యాక్..ఎంఎల్ఏ డౌన్ డౌన్ అంటు గట్టిగా నిరసనతో నినాదాలిచ్చారు. నినాదాలిస్తూనే కొందరు ఎంఎల్ఏపై దాడికి ప్రయత్నించారు. దాంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఎంఎల్ఏకి రక్షణగా నిలిచారు.
పరిస్ధితి సద్దుమణగకపోవటంతో పోలీసులు ఎంఎల్ఏతో మాట్లాడి అక్కడి నుండి పంపేశారు. పర్యావరణ ప్రేమికులుగా చెప్పుకునే కొందరు రోడ్డు విస్తరణకు అడ్డుపడ్డారని స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణలో చెట్లను ప్రభుత్వం కొట్టేస్తుంది కాబట్టి విస్తరణ జరిపేందుకు లేదంటు కొందరు ట్రైబ్యునల్ లో కేసు వేశారు. పిటీషన్ దాఖలు కాగానే ట్రైబ్యునల్ కూడా స్టే ఇచ్చిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. విస్తరణ పనులు ఆగిపోవటంతోనే తరచూ ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్నారని స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.