సీతారాం ఏచూరి స్థానంలో ప్రకాశ్‌ కారత్‌..

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ వ్యవహరిస్తారని వామపక్ష పార్టీ పేర్కొంది.

Update: 2024-09-29 10:56 GMT

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ వ్యవహరిస్తారని వామపక్ష పార్టీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మదురైలో జరిగే 24వ పార్టీ మహాసభల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సెప్టెంబర్ 12న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2005 నుంచి 2015 వరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కారత్.. 1985లో కేంద్ర కమిటీకి ఎన్నికై 1992లో పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు.

అంతకు ముందు ప‌దేళ్ల పాటు..

అంతకుముందు ప్రకాశ్‌ కారత్‌ ప‌దేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1948 ఫిబ్రవరి 7న నాటి బ‌ర్మా (మయన్మార్)లోని లేత్‌ప‌ద‌న్‌లో నాయ‌ర్ కుటుంబంలో జన్మించిన కారత్ సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యురాలైన బృందా క‌ర‌త్‌ను వివాహమాడారు. జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐలో ప‌నిచేస్తూనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్‌) సీపీఎంలో చేరారు. 1982-85 మ‌ధ్య సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ కారత్.. 1985లో సీపీఎం కేంద్ర క‌మిటీకి ఎన్నికయ్యారు. 1992లో సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యుడయ్యారు. 2005లో ఢిల్లీలో జ‌రిగిన సీపీఎం 18వ మ‌హాస‌భ‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప‌దేళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2015లో ఏపీలోని వైజాగ్‌లో జ‌రిగిన సీపీఎం 21 మ‌హాస‌భలో ప్రకాష్ కారత్ బాధ్యతల నుంచి త‌ప్పుకున్నారు. అదే సభలో సీపీఎం సీనియ‌ర్ నేత‌ సీతారాం ఏచూరికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 

Tags:    

Similar News