‘ఉగ్రవాదం మీద ఎప్పటికీ ఉక్కుపాదమే..’
టెర్రరిజం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా అంతచూడకుండా వదలమని తీవ్రంగా హెచ్చరించిన ప్రధాని మోదీ ..;
ప్రధాని మోదీ(PM Mod)పాకిస్తాన్‌ను తీవ్రంగా మందలించారు. ఉగ్రమూకలు, వారిని ప్రోత్సహిస్తున్న వారిపై భారత్ వైఖరి కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’అనంతరం ఆయన సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు ఇది తాత్కాలిక విరామేనని చెప్పారు. భారత్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లినా.. ప్రతిస్పందన మాత్రం గట్టిగానే ఉంటుందని హెచ్చరించారు. ఇకపై పాక్ ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తామన్నారు. వారి చర్యలకు బట్టి ప్రతిచర్యలు ఉంటాయన్నారు.
సాయుధ దళాల సాహసాన్ని కొనియాడిన మోదీ..
భారత సాయుధ దళాల సాహసాన్ని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని అన్నారు.
‘న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్’కు పాల్పడితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత రక్షణ దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తాయన్నారు. రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, అవసరం అనుకున్న వెంటనే దాడి మొదలు పెడతాయని స్పష్టం చేశారు.
ప్రధాని ప్రసంగానికి ముందు రెండు రోజులు క్రితం భూ, వాయు, సముద్ర మార్గాల్లో తక్షణంగా కాల్పులు, సైనిక చర్యలు ఆపేందుకు భారత్-పాక్ అంగీకరించిన విషయం తెలిసిందే.
ఈ రోజు మధ్యాహ్నం న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత వైమానిక, భూసేన, నౌకాదళ ఉన్నతాధికారులు మాట్లాడారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేసిన ప్రయత్నాలను రక్షణ దళాలు తిప్పికొట్టిన తీరును వివరించారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్), లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (డీజీ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్), వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ (డీజీ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్) సంయుక్తంగా ఆ వివరాలను వెల్లడించారు.
స్వదేశీ వాయుసేన ఆయుధ వ్యవస్థలు ముఖ్యంగా 'ఆకాశ్' ప్రధాన పాత్ర పోషించిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పుకొచ్చారు.
పాక్ సైనిక దాడులను భారత్‌కి చెందిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్..
మే 7 న పహల్గామ్ ఉగ్రవాద దాడికి (Terror Attack) ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. ఇందులో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.