రాజ్‌కోట్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలతో మాట్లాడిన రాహుల్

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Update: 2024-06-22 12:22 GMT

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం (జూన్ 22) వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాజ్‌కోట్ నగరంలోని నానా-మావా ప్రాంతంలోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో మే 25 న సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలతో సహా 27 మంది మరణించారు.

కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ ఢిల్లీలో గాంధీతో ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, పార్టీ నాయకుడు లాల్జీ దేశాయ్ బాధితుల బంధువులతో ఉన్నారు.

ఘటన జరిగి నెల రోజులు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జూన్ 25న రాజ్‌కోట్ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్రం బాధిత కుటుంబాలకు అధిక నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయనుంది.

కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బాధితుల బంధువులు శనివారం దుకాణాదారులకు వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ రోజు దుకాణాలను మూసి ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

నగర పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూన్ 15న నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గెనీ ఠాకోర్ కూడా నిరసనలో పాల్గొన్నారు.

ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు జరిపిన విచారణలో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక విభాగం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) పొందకుండానే గేమ్ జోన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్రివేది ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

ఇప్పటివరకు అగ్నిప్రమాదానికి సంబంధించి గేమ్ జోన్ ఐదుగురు యజమానులు, ఆరుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు.

ఘటన ఎలా జరిగింది?

వేసవి సెలవులు, అందులోనూ వారాంతం కావడంతో.. మే 25వ తేదీ సాయంత్రం సరదాగా గడిపేందుకు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు గేమ్‌ జోన్‌కు వచ్చారు. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గేమ్‌జోన్‌లో మంటలు చెలరేగాయి. ఎగసిపడిన మంటలు దాటికి గేమ్‌జోన్‌ ఫైబర్‌ డోమ్‌ కూలిపోవడంతో తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రాత్రి 11 గంటల సమయానికి 27 మృత దేహాలను వెలికి తీశారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాద ఘటనపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ విచారం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News