‘ఎంఎస్‌పీ‌పై త్వరలో నివేదిక’

పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై నివేదికను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

Update: 2024-09-19 12:39 GMT

పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై నివేదికను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ప్రకటించారు. మోడీ 3.0 -100 రోజుల పాలన నేపథ్యంలో మంత్రి కొత్త కార్యక్రమాల విశేషాలను విలేఖరులతో పంచుకున్నారు. వ్యవసాయ ఆవిష్కరణలను రైతులతో పంచుకునే శాస్త్రవేత్తల కార్యక్రమం 'ఆధునిక్ కృషి చౌపాల్' అక్టోబర్ నుంచి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతుందని చెప్పారు. "కిసాన్ సంవాద్" అని పిలిచే కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ నాయకులతో వ్యవసాయ శాఖ మంత్రి వారానికోసారి మాట్లాడతారని చెప్పారు. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఎంఎస్‌పీ కమిటీ ఇప్పటివరకు 24 సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించిందని, కమిటీ నివేదికను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

జూలై 2022లో కమిటీ ఏర్పాటు..

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకున్న తర్వాత జూలై 2022లో కమిటీని ఏర్పాటు చేశారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, దేశ అవసరాలను అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల నమూనాలను మార్చడంపై కమిటీ అధ్యయనం చేసింది. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. సకాలంలో విత్తనాలు సరఫరా చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట ఉత్పత్తులకు సరసమైన ధరలను నిర్ణయించడంపై దృష్టి సారించామని చెప్పారు. వాతావరణ మార్పులను తట్టుకోగల 109 అధిక దిగుబడినిచ్చే పంట రకాలను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు చౌహాన్ చెప్పారు. రాబోయే రబీ సీజన్‌లో కొత్త పంటల కోసం విత్తన అవసరాలను ముందుగానే సమర్పించాలని ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఎరువుల కొరత లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరియాయేతర ఎరువులకు రాయితీలను కేబినెట్ ఇటీవల ఆమోదించిందని, ఈ నిర్ణయం రబీ విత్తడానికి సిద్ధమవుతున్న రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.  

Tags:    

Similar News