‘బంగ్లాదేశ్, రోహింగ్యాల చొరబాటు జార్ఖండ్‌కు పెను ముప్పు’
‘బీజేపీ అధికారంలోకి రాగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఔత్సాహికుల మరణాలపై విచారణ ప్రారంభిస్తాం’ - ప్రధాని మోదీ
బంగ్లాదేశ్, రోహింగ్యాల చొరబాటు జార్ఖండ్‌కు పెను ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను JMM, RJD, కాంగ్రెస్ పార్టీలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. జంషెడ్‌పూర్‌లోని గోపాల్ మైదాన్‌లో జరిగిన బీజేపీ 'పరివర్తన్ మహారల్లి'లో ప్రసంగించారు.
ఆ మూడు పార్టీలు జార్ఖండ్ శత్రువులు
"బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులు సంతాల్ పరగణాస్, కోల్హాన్ ప్రాంతాలకు పెను ముప్పుగా మారారు. ఈ ప్రాంతాల జనాభా వేగంగా మారుతోంది. గిరిజన జనాభా క్షీణిస్తోంది. చొరబాటుదారులు పంచాయతీ వ్యవస్థపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. భూమిని లాక్కొని, దురాగతాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోని కుమార్తెలపై.. ప్రతి జార్ఖండ్ నివాసి అసురక్షిత భావనలో ఉన్నారు. JMM, RJD, కాంగ్రెస్ జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులు. ఈ పార్టీలు అధికార వ్యామోహం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తహతహలాడుతున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని కూటమి బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.’’ అని ఆరోపించారు.
హెలికాప్టర్‌లో మోదీ జంషెడ్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా రోడ్డు మార్గంలో ఉక్కు నగరానికి చేరుకున్నారు.
"భారీ వర్షం సహా ఏ అడ్డంకులు మిమ్మల్ని చేరకుండా నన్ను నిరోధించలేవు. మీ ఆప్యాయత నన్ను తాకింది" అని మోదీ ప్రజలనుద్దేశించి అన్నారు.
అధికారంలోకి రాగానే విచారణ..
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఔత్సాహికుల మరణాలపై విచారణ ప్రారంభిస్తామన్నారు.