యెమన్ వెళ్లేందుకు అనుమతించాలని కోరిన ‘‘సేవ్ నిమిషా కౌన్సిల్’’

కేంద్రాన్ని సంప్రదించాలన్న సుప్రీంకోర్టు..;

Update: 2025-07-18 08:23 GMT

కేరళ (Kerala) నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) ఉరి శిక్ష నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే. యెమన్ పౌరుడు అబ్దోను హత్య చేసినందుకు ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నెల 16న శిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే ఉరిశిక్షకు ఒక్క రోజు ముందు కేరళ సున్నీ ఇస్లామిక్ లీడర్ కాంతపురం AP అబూబకర్ ముసలియార్ జోక్యంతో ఉరిశిక్ష వాయిదా పడింది. మరోవైపు ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ పేరిట ఏర్పడిన సంస్థ నిమిష ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. షరియా చట్టం ప్రకారం మృతుడి కుటుంబానికి ‘బ్లడ్ మనీ’ ఇచ్చి క్షమాభిక్ష కోరవచ్చు. వారితో మధ్యవర్తిత్వం వహించేందుకు యెమన్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ దేశంలో ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉండడంతో సుప్రీంకోర్టు(Supreme court)ను ఆశ్రయించింది. తమ సభ్యులను యెమన్‌కు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ పిటీషనర్ తరపు న్యాయవాది రజెంత్ బసంత్ న్యాయస్థానాన్ని కోరారు. విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. దాంతో కౌన్సిల్ సభ్యలు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. విదేశాంగ శాఖ అనుమతిస్తే యెమన్‌ కౌన్సిల్ సభ్యులతో పాటు కేరళ సున్నీ ఇస్లామిక్ లీడర్ కాంతపురం AP అబూబకర్ ముసలియార్ వెళ్లనున్నారు.


ఇంతకు నిమిషా చేసిన నేరమేంటి?

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ పూర్తి చేసింది. 2008లో నర్సుగా పని చేయడానికి యెమెన్ దేశానికి వెళ్లింది. కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసిన అనుభవంతో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించాలనుకుంది. యెమెన్ నిబంధనల ప్రకారం విదేశీయులు క్లినిక్ తెరవడానికి వీల్లేదు. స్థానికుల భాగస్వామ్యంతో క్లినిక్ నడపవచ్చని తెలుసుకున్న నిమిష.. తన బిజినెస్ పార్ట్‌నర్‌గా తలాల్ అబ్దోను ఎంచుకుంది. అప్పటికే నిమిషాకు పెళై కూతురు కూడా ఉంది. కూతురి బాప్టిజం కార్యక్రమానికి నిమిషాతో అబ్దో కేరళకు వచ్చాడు. ఇంట్లో ఉన్న నిమిష పెళ్లి నాటి ఫొటోలు అబ్దో దొంగిలించినట్లు సమాచారం. ఆ ఫోటోలను యెమన్‌లో మార్ఫింగ్ చేయించి నిమిషాను తన భార్య అని చెప్పకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్దో జైలు పాలయ్యాడు. విడుదలై వచ్చాక నిమిషను వేధించటం మొదలెట్టాడు. క్లినిక్ ద్వారా వచ్చే డబ్బును బలవంతంగా తీసుకెళ్లేవాడు. తన వేధింపులకు భరించలేక కేరళకు వెళ్లిపోతుందేమోనని ఆమె పాస్ పోర్టును కూడా తన వద్దే ఉంచుకున్నాడు. అబ్దో వేధింపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్న నిమిష ఓ ప్లాన్ వేసింది. మత్తు మందు ఇచ్చి తన పాస్ పోర్టు తీసుకుని కేరళ వెళ్లిపోవాలనుకుంది. ప్లాన్‌లో భాగంగా అబ్దోకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. డోస్ ఎక్కువకావడంతో అబ్దో చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో మత్తుమందు ఇవ్వడం వల్లే మృతిచెందాడని నిర్ధారణ కావడంతో నిమిషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది. తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది.

‘బ్లడ్ మనీ’కి సిద్ధమైన నిమిషా ఫ్యామిలీ..

నిమిషను కాపాడుకోడానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’(Blood money)కి సిద్ధమైంది. ఆమెను ఉరి నుంచి కాపాడేందకు ఏర్పాటయిన సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ డబ్బును స్వీకరించి అబ్దో కుటుంబసభ్యులు నిమిషకు క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష నుంచి బయటపడినట్లే. 

Tags:    

Similar News