99 శాతానికి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి: ఈసీ
డిసెంబర్ 4వ తేదీతో ముగియనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ..
తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోన్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో భాగంగా 99 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(E.C) సోమవారం తెలిపింది. 50.97 కోట్ల మంది ఓటర్లలో 50.50 కోట్లకు (99.07 శాతం) ఓటర్లకు పాక్షికంగా పూరించిన ఫారాలను జారీ చేసినట్లు పోల్ అథారిటీ తన రోజువారీ SIR బులెటిన్‌లో తెలిపింది. నవంబర్ 4న ప్రారంభమయిన S.I.R రెండో దఫా డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది.
ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలయిన పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఎస్ఐఆర్ కొనసాగుతుండగా.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరుగుతాయి. అదే ఏడాది ఎన్నికలు జరగనున్న అస్సాంలోనూ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణను ప్రకటించింది.