మధురై విమానాశ్రయ విస్తరణ ఆగిపోడానికి కారణమేంటి?
విమానాశ్రయం పేరు మార్పుపై పట్టుబడుతున్నడెవరు?
మధురై (Madurai) విమానాశ్రయ విస్తరణ (Airport expansion) నిలిచిపోడానికి తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వమే కారణమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పేర్కొంది. ‘‘విస్తరణకు అవసరమైన 633.17 ఎకరాలలో 543.64 ఎకరాలను మాత్రమే ఇచ్చారు. మిగిలిన 89.53 ఎకరాలు, అదనంగా అవసరమైన మరో 17.69 ఎకరాలు మొత్తం 107.22 ఎకరాలను ఇంకా బదిలీ చేయాల్సి ఉంది. పూర్తి భూమిని అప్పగించిన తర్వాతే రన్‌వే పొడిగింపు పనులు ప్రారంభమవుతాయి,’’ అని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు AAI సమాధానమిచ్చింది.
మధురై ఎంపీ ఆగ్రహం..
కేంద్రం ఉద్దేశపూర్వకంగానే మధురై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం లేదని సీపీఐ(ఎం) లోక్‌సభ సభ్యుడు, మధురై ఎంపీ వెంకటేశన్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో విమానాశ్రయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. మధురైకి మెట్రో రైలు ప్రాజెక్టును కూడా కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు
విమానాశ్రయం పేరు మార్పుపై..
మధురై విమానాశ్రయం పేరును మార్చాలని కొంతమంది పట్టుబడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తేవర్ సమాజానికి చెందిన ముత్తురామలింగ తేవర్ పేరును పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సిఫార్సు రాలేదని AAI పేర్కొంది. విమానాశ్రయాల పేరు మార్చడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని AAI స్పష్టం చేసింది.
విమానాశ్రయానికి ముత్తురామలింగ తేవర్ పేరు పెట్టాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి డిమాండ్ చేస్తుండగా.. పుతియ తమిళగం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె. కృష్ణసామి మరో నాయకుడి పేరు పెట్టాలని పట్టుబడుతున్నారు. 1957లో అంటరానితనానికి వ్యతిరేక పోరాడి హత్యకు గురైన దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తియాగి ఇమ్మాన్యుయేల్ శేఖరన్ పేరును ఆయన ప్రతిపాదించారు.