ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్
బీఆర్ఎస్ హయాంలో 300 కోట్ల మైనింగ్ మోసాలు జరిగినట్టు గుర్తించిన ఈడీ
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమ్ముడి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన రూ.80కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలు చేసిందని, అంతేకాకుండా ప్రభుత్వానికి మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆస్తుల్ని అటాచ్ చేసింది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు.
జూన్ 2024లో ఈడీ మహిపాల్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి ఇళ్లతోపాటు పాటు 10 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.19 లక్షల నగదు, అనేక బినామీ ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సమయంలో మధుసూధన్ రెడ్డి వద్ద అసలు ఆస్తి డాక్యుమెంట్లు దొరికాయి. ఈ ఆస్తులు వేర్వేరు వ్యక్తుల పేర్లపై ఉన్నప్పటికీ, డాక్యుమెంట్లు మాత్రం యజమానిగా మధుసూధన్ రెడ్డి ఉన్నట్లు తేలింది. వారు మధుసూధన్ రెడ్డి బినామీలే అని నిర్దారణ అయ్యింది.దీని ఫలితంగా, రూ.78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ సంస్థల పేర్లలో రూ.1.12 కోట్ల స్థిర డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. మొత్తం రూ.80 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేశారు.దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జూలై 2024లో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.