మదీనా విషాదం: షోయబ్‌కు తెలంగాణ సర్కారు చేయూత
షోయబ్ కోలుకుంటున్నాడన్న సంతోషంలో తెలంగాణ ప్రతినిధి బృందం
By : The Federal
Update: 2025-11-24 01:56 GMT
మదీనా బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన షోయబ్ ను తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది. మదీనా నగరంలోని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న షోయబ్ ను మంత్రి బృందం కలిసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంది.
షోయబ్ కు మెరుగైన వైద్యం
షోయబ్ కు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మదీనా ఆసుపత్రి అధికారులను కోరారు. బస్సు ప్రమాదంలో షోయబ్ పాస్ పోర్టు కాలిపోయినందున మరో పాస్ పోర్టు జారీ చేయాలని భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయం, పాస్ పోర్టు అధికారులను మంత్రి సూచించారు. షోయబ్ కు అన్ని రకాల మద్ధతు ఇస్తామని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్ మృతులకు మదీనాలోని జన్నతుల్ బఖీలో అంత్యక్రియలు చేయించాక మంత్రి బృందం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షోయబ్ ను కలిసి పరామర్శించింది.
కోలుకుంటున్న షోయబ్
షోయబ్ ఆరోగ్య పరిస్థితి, అతని క్షేమ సమాచారం, విషాద సంఘటన పరిస్థితుల గురించి అతన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. షోయబ్ తో పాటు మృతుల కుటుంబాలకు తాము అన్ని రకాల సహాయం చేస్తామని మంత్రి అజారుద్దీన్ హామి ఇచ్చారు. షోయబ్ కోలుకుంటున్నాడని, త్వరలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి వార్డుకు మారుస్తామని వైద్యులు చెప్పినట్లు అజారుద్దీన్ పేర్కొన్నారు.
షోయబ్ త్వరగా కోలుకోవాలని అజారుద్దీన్ తో పాటు ప్రభుత్వ ప్రతినిధి బృందం సభ్యులు ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీల సంక్షేమం) బి.షఫియుల్లాలు అల్లాను ప్రార్థించారు. షోయబ్ త్వరగా కోలుకొని స్వస్థలమైన హైదరాబాద్ కు చేరుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు ప్రతినిధి బృందం తెలిపింది.