దానం నాగేందర్ డిసైడ్ అయిపోయారా ?

కడియం, దానంపైన మాత్రం వేటు తప్పదు అని అర్ధమవుతోంది.

Update: 2025-11-23 08:11 GMT
BRS Khairatabad MLA Danam Nagendar

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ డిసైడ్ అయిపోయినట్లే ఉన్నారు. రెండు మూడు రోజుల్లో ఎంఎల్ఏగా రాజీనామా చేయబోతున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. పదిమంది బీఆర్ఎస్(BRS) ఎంఎల్ఏల మీద ఫిరాయింపుల ఆరోపణలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. పదిమందిలో 8మంది ఎంఎల్ఏల విచారణ ముగిసింది. ఇద్దరు ఎంఎల్ఏలు (Kadiyam Srihari)కడియంశ్రీహరి, (Danam Nagendar)దానం నాగేందర్ మాత్రం స్పీకర్ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో స్పీకర్ వీళ్ళిద్దరికీ మరో అవకాశం ఇస్తు ఆదివారం సాయంత్రానికల్లా సమాధానాలు చెప్పాలని మూడురోజుల క్రితమే నోటీసులు జారీచేశారు. అయితే వీళ్ళిద్దరు నోటీసులకు సమాధానాలు చెప్పకుండా తమకు మరికొంత సమయం కావాలని అడిగారు. ఆదివారం ఉదయం దానం నాగేందర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. సమాధానం ఇవ్వటానికి మరింత సమయం కావాలని లేఖలో కోరారు.

దానం లేఖపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఫిరాయింపులను విచారించి తగిన నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలన్న స్పీకర్ రిక్వెస్టును సుప్రింకోర్టు ఆమోదించింది. స్పీకర్ కోరినట్లుగా నాలుగు వారాల గడువు ఇచ్చి కూడా వారం రోజులైపోయింది. మిగిలిన మూడువారాల్లో కడియం, దానం ఇద్దరినీ విచారించి స్పీకర్ సుప్రింకోర్టుకు రిపోర్టు అందించాలి. మొత్తం పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపైన అనర్హత వేటు వేలాడుతున్న విషయం తెలిసిందే.

పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కడియం, దానంపైన మాత్రం అనర్హత వేటుపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జిగిత్యాల ఎంఎల్ఏ సంజయ్, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. అలాగే స్పీకర్ సమక్షంలో జరిగిన విచారణలో కూడా లాయర్లను పెట్టుకుని వాదనలు వినిపించారు.

ఎనిమిది మంది ఎంఎల్ఏల విచారణ పూర్తయిన నేపధ్యంలో మిగిలింది కడియం, దానం విచారణ మాత్రమే. పైన చెప్పిన ఎనిమిది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరినట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కొందరు ఎంఎల్ఏలు సుప్రింకోర్టుకు చెప్పారు. అలాగే విచారణలో స్పీకర్ సమక్షంలో కూడా తమ వాదనలు వినిపించారు. ఇటు ఫిరాయింపులు అటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించుకున్నారు. అయితే పైన చెప్పిన ఎనిమిదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరినట్లుగా సాంకేతికమైన ఆధారాలను స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అందించలేకపోయారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనేందుకు ఆధారాలుగా పార్టీఫండ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏల జీతాల్లో నుండి కోతపడుతున్న వివరాలను ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు ఆధారాలుగా స్పీకర్ కు చూపించారు.

వీళ్ళవిషయాన్ని వదిలేస్తే మిగిలిన కడియం, దానంపైన మాత్రం వేటు తప్పదు అని అర్ధమవుతోంది. కారణాలు ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏ అయిన దానం 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న దానం కాంగ్రెస్ ఎంపీగా ఎలా పోటీచేస్తారు ? దానంపై అనర్హత వేటు పడటానికి ఇంతకన్నా ఆధారం ఇంకేమికావాలి ? అలాగే వరంగల్ ఎంపీగా పోటీచేసిన కడియం కావ్య నామినేషన్ను ప్రతిపాదించిన వారిలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. అలాగే కడియం కావ్యకు ఓట్లేసి గెలిపించాలని శ్రీహరి ప్రచారం చేశారు. ఇంతకీ కావ్య ఎవరంటే శ్రీహరి కూతురు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి నామినేషన్ పై బీఆర్ఎస్ ఎంఎల్ఏ హోదాలో శ్రీహరి ప్రతిపాదిస్తు ఎలాగ సంతకం పెడతారు ? సంతకంతో పాటు ఎంపీ అభ్యర్ధికి చేసిన ప్రచారం చాలు కడియంపై అనర్హత వేటుపడటానికి.

తమపై అనర్హత వేటుపడటం ఖాయమని శ్రీహరి, దానంకు బాగా తెలిసినట్లుంది. అందుకనే స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇవ్వకుండా ఎంత వీలైతే అంత సమయాన్ని లాగుదామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళిద్దరు నోటీసులకు సమాధానం ఇవ్వకపోయినా, విచారణకు హాజరుకాకపోయినా సుప్రింకోర్టు నాలుగు వారాల గడువు అయితే ఆగదు. అందుకనే సుప్రింకోర్టుకు తనపైన ఆగ్రహం రాకముందే స్పీకర్ మొత్తం పదిమంది ఎంఎల్ఏల విచారణకు సంబందించిన రిపోర్టును సుప్రింకోర్టుకు అందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అప్పుడు సుప్రింకోర్టు తీసుకోబోయే నిర్ణయాన్ని ఫిరాయింపులు ఆమోదించాల్సిందే తప్ప వేరేదారిలేదు.

అందుకనే వీలైనంత తొందరగా ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసే యోచనలో కడియం, దానం మానసికంగా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. రాజీనామాల కారణంగా జరగబోయే ఉపఎన్నికలో టికెట్ విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంనుండి స్పష్టమైన హామీరాగానే ఇద్దరూ రాజీనామా చేసేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సమాధానాలు చెప్పటానికి కాస్త సమయంకావాలని వీళ్ళుఅడుగుతున్నది కేవలం టైం టేకింగ్ కోసమే అని అర్ధమవుతోంది.

Tags:    

Similar News