‘ఉప ఎన్నికల్లో పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే’

స్టేషన్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Update: 2025-11-22 11:16 GMT

‘‘ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో కచ్చితంగా మళ్లీ పోటీ చేస్తా నేనే గెలుస్తా’’ అని వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంశ్రీహరి శనివారం అన్నారు. తెలంగాణరాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణపై సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపించడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణను వేగవంతం చేశారు.

ఈ నేపధ్యంలోనే కడియం మీడియాతో మాట్లాడుతు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వటానికి గడువు కోరినట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని స్పీక కడియం, దానం నాగేందర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కడియం చెప్పారు. స్పీకర్‌ ఇచ్చిన గడువులోగా వివరణ ఇస్తానని వెల్లడించారు. స్పీకర్ నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. ‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి పెద్దఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కడియం శ్రీహరి ఎవ్వరికి భయపడడు’ అని అన్నారు

శ్రీధర్ బాబును కలిసిన దానం

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబును కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఈ విషయంపై ఏఐసీసీ పెద్దలతో దానం సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యేగా రాజీనామా, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తాను రాజీనామా చేస్తే జరిగే ఉపఎన్నికలో తనకే టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటే రాజీనామా చేస్తానని సన్నిహితులకు దానం చెప్పినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఉత్కంఠను రేపుతున్న స్పీకర్ నోటీసులు

మిగతా ఎమ్మెల్యేల విచారణ తుది దశకు వచ్చినప్పటికీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుంచి ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. దాంతో స్పీకర్ కార్యాలయం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. గతంలో జారీచేసిన నోటీసులకు వీరి నుంచి సమాధానం రాకపోవడంతోనే ఈ తాజా నోటీసులు జారీ అయ్యాయి.

మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. వీరు ఇప్పటికే తమ అఫిడవిట్లను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. విచారణలో ఫిర్యాదుదారులు, ఈ 8 మంది ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు స్పీకర్ సమక్షంలో తమ తుది వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం స్పీకర్ వీరిపై తీర్పును రిజర్వ్ చేశారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, డాక్టర్‌ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి విచారణ పూర్తయ్యింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ క్షణమైనా వీళ్లపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఈ మొత్తం ప్రక్రియ ఇంత స్పీడ్ గా జరగడానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడమే. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించడంతో న్యాయస్థానం మొదట మూడు నెలల గడువు విధించింది. ఆ గడువు ముగిసినప్పటికీ విచారణ పూర్తి కాలేదు. దీంతో స్పీకర్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాలపాటు గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసేలోగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి స్పీకర్‌కు వాటిల్లింది.

ఈ నెల 23లోగా దానం, కడియం తమ సమాధానాలను సమర్పించాల్సి ఉంది. వాళ్లు ఇచ్చిన సమాధానాలను బీఆర్ఎస్ పిటిషనర్లకు పంపిస్తారు. వాళ్ల సమాధానాలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు, ఆధారాలను స్పీకర్ కోరుతారు. అనంతరం ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో వాదనలు జరుగుతాయి. చివరగా న్యాయనిపుణుల సలహా తీసుకుని, సుప్రీంకోర్టు గడువు ముగిసేలోగా స్పీకర్ తననిర్ణయాన్ని వెల్లడించి, నివేదికను కోర్టుకు సమర్పిస్తారు.

మొత్తం మీద తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల డ్రామా చివరి అంకానికి చేరుకుంటోంది. 8 మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై స్పీకర్ తీర్పు రిజర్వ్ చేయగా దానం, కడియంలపై ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టు తుది గడువు మెడపై కత్తిలాగ వేలాడుతుండటంతో స్పీకర్ మీద కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. చివరకు ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎంతమంది మీద అనర్హతవేటు పడుతుందో చూడాలి.

Tags:    

Similar News