పైరసీ భూతం పుట్టుకకు టికెట్ రేట్లు పెరగడమే కారణమా..!
ఇమ్మడి రవి అరెస్ట్‌తో మరోసారి తెరపైకి మూవీ టికెట్ రేట్ల పెంపు అంశం. డిఫెన్స్‌లో సినీ ఇండస్ట్రీ.
సినిమాను పైరసీ చేయడం, పైరసీ కాపీని చూడటం రెండూ తప్పే. కానీ పైరసీకి భారీగా ఆదరణ లభిస్తుంది. అందుకు ‘IBOMMA’ పెద్ద నిదర్శనం. ఇదొక్కటనే కాదు.. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లు ఇంకా చాలా ఉన్నాయ్. కానీ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో ‘ఐబొమ్మ’ కీలకంగా మారింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది రవికి మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా వాళ్లు తమ లాభాల కోసం ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారని, అందుకే అభిమానులు, ప్రజలు పైరసీ వైపు అడుగులు వేస్తున్నారని పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరయితే ‘జస్టిస్ ఫర్ రవి’ అని కూడా పోస్ట్ పెడుతున్నారు. దీంతో సినిమా టికెట్ రేట్లు పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పైరసీ భూతం పుట్టడానికి, ఇంత బలంగా మారడానికి సినిమా వాళ్లే కారణమా? టికెట్ రేట్లు పెంచడం వంటి వారి నిర్ణయాలే పైరసీని పెంచి పోషిస్తున్నాయా? లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు నిర్మాతలు టికెట్ రేట్లు పెంచడాన్ని సమర్థించుకునేలా మాట్లాడుతున్నారు.
రేట్లు పెరిగిన సినిమాలే పైరసీ అవుతున్నాయా: బన్నీ వాసు
తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్లే సినిమాలు పైరసీ అవుతున్నాయని అన్న విషయాన్ని ఆయన ఖండించారు. పైగా ఆయన ఎదురు ప్రశ్నలు సంధించారు. ‘‘టికెట్ రేట్లు పెంచిన సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఎన్నో సినిమాలు విడుదలయితే వాటిలో కొన్ని సినిమాల టికెట్ రేట్లే పెరుగుతున్నాయి. మరి మిగిలిన సినిమాలు ఎందుకు పైరసీ అవుతున్నాయి. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు పైరసీ అవుతున్నాయి కదా? పైరసీకి, టికెట్ రేట్లు పెరగడానికి సంబంధం ఏముంది?’’ అని బన్నీ వాసు వ్యాఖ్యానించారు.
రేట్లు కాకుంటే.. పైరసీకి ప్రోత్సాహం ఏంటి..
పైరసీ చేయడం అనేది తప్పు. ఒకరి కష్టాన్ని మనం దోచుకోవడమే అవుతుంది. అది అందరికీ తెలుసు. కానీ పైరసీ సినిమాలను చూడటానికి ఎక్కువ మంది ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది చెప్తున్న సమాధానం టికెట్ రేట్లు. థియేటర్లు(మల్టీప్లెక్స్‌లు) మధ్యతరగతి ఆడియన్స్ కాదని, ధనికుల కోసమే అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకు అక్కడ ఉంటున్న రేట్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. టికెట్ రేట్ ఒక సమస్య అయితే, థియేటర్లోకి వెళ్లిన తర్వాత నీళ్లు తాగాలన్నా, ఏమైనా స్నాక్స్ తినాలన్నా కూడా జేబుకు చిల్లు పడే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అదే పైరేట్ సైట్లలో అయితే.. క్వాలిటీ, ఫీల్ ఆ రేంజ్‌లో ఉండకపోయినా.. జేబు సేఫ్‌గా ఉంటుందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ఫ్యామిలీ థియేటర్లో సినిమా చూడాలంటే భయపడే పరిస్థితులు ఉంటున్నాయని చెప్తున్నారు.
బాటిల్ రేట్స్ చూస్తే భయమేస్తోంది..
మూవీ థియేటర్లు ఇది వరకటిలా లేవు. ఇప్పుడు అన్ని పరిస్థితులు మారాయి. థియేటర్లోకి వాటర్ బాటిల్‌ను కూడా అనుమతించారు. మన చేతిలో వాటర్ బాటిల్ ఉంటే.. దానిని అక్కడే డస్ట్‌బిన్‌లో పడేస్తారు. ఇక స్నాక్స్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. తాగే నీళ్లకే అనుమతించి వాళ్లు.. స్నాక్స్‌ను అనుమతిస్తారా.. ససేమిరా. లోపలికి వెళ్లిన తర్వాత ఒక మంచినీళ్ల బాటిల్ కొనాలన్నా.. భారీగా రేట్ ఉంటుంది. లీటర్ వాటర్ బాటిల్ బయట 20 రూపాయలు ఉంటే.. థియేటర్లో అది రూ.50 నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు. గొంతు ఎండిపోతుందని నీళ్లు తాగుదామనుకుంటే ఆ రేట్లు మరోసారి గొంతెడుకుపోయేలా ఉంటున్నాయి.
ఇక స్నాక్స్ వైపు చూడటం కూడా కష్టమే. అక్కడ రేట్లు రూ.200 దగ్గర స్టార్ట్ అవుతాయి. అవి వేలను కూడా టచ్ చేసేలా ఉంటాయి. పాక్‌కార్న్/ఫ్రెంచ్ ఫ్రైస్ రేట్లు సుమారు.. మినీ ప్యాక్ రూ.200, మీడియం ప్యాక్ రూ.300, లార్డ్ ప్యాక్ రూ.400, ఎక్స్‌ట్రా లార్జ్ ప్యాక్ రూ.700 ఈ తరహా రేట్లు ఉంటాయి. ఇక సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే స్నాక్.. పాప్‌కార్న్ అది అయితే ఫ్లేవర్‌ను బట్టి రేట్లు మారతాయి. అది కూడా ఇంతే రేట్లు వాయించేస్తాయి. స్మాల్ టబ్ పాప్‌కార్న్ విత్ చీజ్/క్యారెమిల్ రూ.500పైనే ఉంటుంది. రూ.50 ఉండే కూల్ డ్రింక్.. ట్యాక్స్‌లన్నీ కలుపుకుని రూ.200-400 వరకు అమ్ముతున్నాయి కొన్ని థియేటర్లు. ఇవన్నీ చూసి చల్లగా ఏమైనా తిందామనుకుని ఐస్‌క్రీమ్ వైపు వెళ్తే.. అవి స్టార్టింగే.. సింగిల్ స్కూప్ రూ.60 ఉంటుంది. అందులో కూడా సేమ్ పాప్‌కార్న్ తరహాలోనే ఫ్లేవర్‌కి ఓ రేట్ ఉంటుంది. నలుగురు కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళ్తే రూ.3000-4000పైనే ఖర్చు అవుతుంది.
సుప్రీం కోర్టు చెప్పినా మారని తీరు..
మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అదరగొడుతున్న రేట్లపై నవంబర్ 5న సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే తరహాలో ఆకాశాన్నంటేలా రేట్లు పెడితే.. ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల వైపు కూడా చూడకుండా పోతాడని తెలిపింది. సినిమా టికెట్ల ధరలపై పరిధిని పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా దానిని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడి ధర్మాసం విచారించింది. ఆ విచారణ సందర్భంగానే థియేటర్లలో ధరలపై ధర్మాసనం స్పందించింది. ‘‘తాగునీటి బాటిల్‌కి రూ.100, కాఫీకి రూ.700 ఛార్జ్ చేస్తున్నారా. సినిమా హాళ్లు తమ ధరలను ఫిక్స్ చేసుకోవాలి. ప్రజలకు రీజనబుల్ ప్రైజ్‌లు అందించాలి. లేదంటే థియేటర్లు అన్నీ ఖాళీగా మారతాయి’’ అని హెచ్చరించారు. అయినా చాలా థియేటర్లలో భారీ ధరలనే కొనసాగిస్తున్నారు. సినిమా టికెట్ కొనడమే గగనం అవుతుంతే.. థియేటర్లలో రీఫ్రెష్ అవడం కోసం ఏమైనా తినాలన్నా, తాగాలన్నా వీలుపడని పరిస్థితులు వస్తున్నాయి.
ధరల భయానికే పైరసీ బాట..
ఈ ధరలు తట్టుకోలేకనే.. చాలా మంది పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. దానికి తోడు థియేటర్‌కు వెళ్తే ఒక్కరిమే చూడాలి. అదే పైరసీ అయితే ఇంట్లో వాళ్లందరితో చూసేయొచ్చు. వాళ్లని కూడా థియేటర్‌కు తీసుకెళ్తే.. ఆ ధరల దెబ్బ తట్టుకోలేం. దానికి తోడు కంఫర్ట్ కూడా ఇందులో భాగమే అవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రేక్షకులు పైరసీ వైపు అడుగు వేసేలా చేయడంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో ధరలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటి ధరల పెంపు చర్యలను సమర్థించుకోవడానికి ఇండస్ట్రీ వాళ్లు ప్రయత్నిస్తున్నారని కొందరు నెటిజన్లు అంటున్నారు.
ఒకానొక సమయంలో సినిమా హాళ్లు సరిగా అందుబాటులో లేకపోవడంతో సీడీలు, డీవీడీల రూపంలో పైరసీ అయ్యేది. కానీ ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నా వాటి ధరలు భారీగా ఉండటంతో పైరసీ భూతం పెరిగిపోతోందని, ఆఖరికి ఒక పైరసీ దందా చేసే వ్యక్తికి ప్రజలు బహిరంగంగానే మద్దతు తెలిపే స్థాయికి వచ్చిందని నిపుణులు అంటున్నారు. దీనిపై సినీ ఇండస్ట్రీ సమీక్షించుకోవాలని, ఈ ధరలపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్లు వేలల్లో వచ్చినా ఆశ్చర్యమక్కర్లేదని చెప్తున్నారు.