ఎత్తిన జెండా దించకోయ్, అరుణ పతాకకు జై.... అంటున్న మావోయిస్టులు

కన్నీళ్ల కడలిలోనే డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్‌.జి.ఏ. వార్షికోత్సవాలు

Update: 2025-11-22 11:01 GMT

‘మళ్లీ లెేచి వస్తాం’ అంటున్నారు, ఎర్రజండా ఎగరేస్తాం అంటున్నారు మిగిలిపోయిన మావోయిస్టులు. వందలాది మంది కామ్రేడ్స్ ను కోల్పోయినా, నాయకత్వం ఎన్ కౌంటర్లతో,  లొంగుబాట్లతో చిందర వందర అయినా అలాంటి ఆటుపోట్లు సహజం అంటున్నారు. తాము నష్టపోయాయం కాని ఓడిపోలేదని చెప్పేందుకు మావోయిస్టు పార్టీ (సిసిఐ-మావోయిస్టు) ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (People’s Liberation Guerrilla Army: PGLA) రజతోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.

డిసెంబర్ 2 నాటికి  ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ ర‌జ‌తోత్స‌వాన్ని పురస్క‌రించుకొని డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్‌.జి.ఏ. వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో జరపాల్సిందిగా విప్లవ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, పార్టీ కమిటీలకు తెలంగాణ‌ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.  

కగార్ ఆపరేషన్ (Kagar Opearation) పేరుతో కొనసాగిస్తున్న భీకర యుద్ధంలో  అసమాన ధైర్యసాహ‌హాసాలతో ప్రతిఘటిస్తూ అమరులైన‌వారికి, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న విప్లవకారులకు విప్లవాభివందనాలు తెలియజేస్తూ సీఎంసీ (CMC) పేరుతో 16 పేజీల లేఖ‌ను విడుద‌ల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిఎల్‌జిఏ ఆదేశించింది.

ప్ర‌స్తుతం పార్టీ నాయకత్వం ముందు ఉన్న స‌వాళ్ళు, లక్ష్యాలను ఈ లేఖలో ప్ర‌స్తావించారు. గెరిల్లా యుద్ధ నియమాలను కచ్చితంగా అమలు చేయడం, కేంద్రీకృత బలగాలను వికేంద్రీకృతం చేయాలని నిర్ణయించారు.  అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ, సైనిక, సామూహిక కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్ పెట్టనున్నట్లుగా ఈ లేఖ‌లో తెలిపారు.

గత 22 నెలలుగా ఆచరణలో జరిగిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం ద్వారా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలు రూపొందించిన ఎత్తుగడలను సరిగా అమలు చేయడం ద్వారా పార్టీని,  ప్రజాసంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామ‌ని పీఎల్ జీఏ. పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి లేఖలో ఇలా పేర్కొన్నారు.“ పొలిట్ బ్యూరో రూపొందించిన రాజకీయ, సైనిక ఎత్తుగడలను సరిగా అమలు చేస్తూ, ఆచరిస్తూ ఈ నష్టాలను నివారించుకోవాలి. ఈ నష్టాల నివారణ ద్వారా పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ప్రజాసంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం, వాటిని పునర్నిర్మిద్దాం.” 

గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి  చెందిన 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన కామ్రేడ్ చారుమజుందార్ అమరుడైన 53 ఏళ్ల తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరుడు కావడం  పార్టీకి, విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టంమని PLGA పేర్కొంది. ఈ సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీకి  చెందిన 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్రకమిటీ సభ్యులు అమరులు కావడంతో  కేంద్ర, రాష్ట్ర కమిటీలు తీవ్రంగా నష్టపోయాయి. 

ప్రస్తుతం విప్లవోద్యమం తీవ్రంగా నష్టపోయిన స్థితిలో గతంలాగా వార్షికోత్సవాలను జరుపుకోలేం కాబట్టి, ఉద్యమ ప్రాంతాల్లో పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. బలగాల రక్షణకు ప్రాధాన్యతనిస్తూనే ఈ వార్షికోత్సవాలను జరుపుకోవాలని పీ.ఎల్.జీ.ఏ పేర్కొంది.“దేశవ్యాప్తంగా అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో అన్నిచోట్ల గ్రూపు మీటింగులు, చిన్న చిన్న మీటింగుల రూపంలో, రహస్య పద్ధతుల్లో ఈ వార్షికోత్సవాలను జరుపుకోవాలి. ఉద్యమ ప్రాంతాలంతటా పోస్టర్లు వేసి, కరపత్రాలు పంచి ప్రజల్లో పీ.ఎల్.జీ.ఏ.ను బలోపేతం చేసుకోవాలి.  తగిన అర్హతలున్న వారిని పీ.ఎల్.జీ.ఏ. లోకి భర్తీ చేసుకోవాలి,”అని  పీఎల్‌జీఏ సూచించింది. 

అంతిమ యుద్ధం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవోద్యమ ప్రాంతాల్లో 8 ల‌క్ష‌ల 50 వేల‌ పోలీసు, కేంద్ర సాయుధ బలగాలను, కమాండో బలగాలను, భారత సైన్యాన్ని, వాయు సైన్యాన్ని మోహరించి దాడులు చేస్తున్నప్పటికీ ఆ దాడులను అత్యంత ధైర్యసాహసాలతో ప్రతిఘటించాం. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక అధికారుల, టెక్నిషియన్ల భాగస్వామ్యంతో సాగిన కర్రెగుట్ట అభియాన్ ను విఫలం చేశాం. తాత్కాలిక వెనకంజ నుండి విప్లవోద్యమాన్ని పురోగమింపచేద్దామ‌ని ఈ లేఖ‌లో పిలుపునిచ్చారు.

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారత సాయుధ దళాలు బస్తర్ అడ‌వుల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్నాయి. మరో వైపు మావోయిస్టు పార్టీకి చెందిన ప్ర‌జా విముక్తి గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 25వ వారోత్సవాలకు సిద్ధమవుతోంది. తుపాకుల నీడలో డిసెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న వారోత్సవాల నేపథ్యంలో అడ‌విలో అల‌జ‌డి నెల‌కొంది. ఓ వైపు పోలీసు యంత్రాంగం పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు తాము ఏర్పాటు చేయ‌బోయే గెరిల్లా సైన్యంలో చేరండి అంటూ మావోయిస్టులు పోస్ట‌ర్లు విడుద‌ల చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందోన‌ని స్థానిక గిరిజ‌నులు భ‌యప‌డుతున్నారు.

Similar News