ఎన్నికలకు బీజేపీ అజెండా సెట్ చేసుకున్నదా ?
తాము మతతత్వవాదులమే అనటంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్లు బండి చెప్పారు
తెలంగాణలో జరగబోయే ఏ ఎన్నికల్లో గెలుపుకు బీజేపీ అజెండా సెట్ చేసుకున్నది. ఇంతకీ ఆ అజెండా ఏమిటంటే మతాన్ని రెచ్చగొట్టడమే. అవును, మీరు చదివింది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయే(Bandi Sanjay) చెప్పారు. హుజూరాబాద్ లో బండి మీడియాతో మాట్లాడుతు హిందుత్వ నినాదంతోనే తాము గడగడకు తిరుగుతామని చెప్పారు. తెలంగాణ(Telangana)లో రామరాజ్యం తెచ్చి తీరుతామన్నారు. తాము మతతత్వవాదులమే అనటంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదని కూడా కుండబద్దలు కొట్టినట్లు బండి చెప్పారు. ముస్లింలను పొగుడుతున్న పార్టీలతోనే జైశ్రీరామ్ అనిపిస్తామని సవాలు చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదేవిషయాన్ని బండి ప్రస్తావిస్తు మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగితే తప్పేముందని నిలదీశారు. తాను హిందు ధర్మ పరిరక్షణతో పాటు ప్రజల కోసమే పాటుపడతానని చెప్పారు. ఈ విషయాలను గమనించిన తర్వాతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనకు తెలంగాణ అద్యక్షునిగా అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిందన్నా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే వాతావరణ కనిపించిందన్నా కారణం హిందుత్వమే అని స్పష్టంగా తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువులను ఓటుబ్యాంకుగా మార్చుకోవటం వల్లే తమ పార్టీ 48 డివిజన్లలో గెలిచిందన్నారు. హిందువులను ఎగతాళిచేయటం వల్లే పోయినఎన్నికల్లో జనాలు బీఆర్ఎస్ ను ఓడించినట్లు బండి చెప్పారు. ఉగ్రవాదులు హిందువులను గుర్తించి పహల్గాంలో కాల్చిచంపారని, హైదరాబాదులో ముస్లింలు రెండు ఆలయాలను కూల్చేశారని, గోరక్షకులపైన కాల్పులు జరిపారని, నిజామాబాదులో ముస్లిం యువకుడు కానిస్టేబుల్ ను చంపిన విషయాన్ని గుర్తుచేశారు. హిందువులు, దేవాలయాలపైన అదేపనిగా దాడులు జరుగుతున్నా తాము హిందుత్వపై మాట్లాడకుండా ఎలాగ ఉంటామని బండి ఎదురు ప్రశ్నించారు.
దేశజనాభాలో 12శాతం ఉన్న ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకమవ్వటం సరైనదే అయినపుడు 80శాతం హిందువులను ఒకటిచేయటం తప్పు ఎందుకవుతుందన్నారు. మొత్తానికి బండి వ్యాఖ్యలు చూసిన తర్వాత తెలంగాణలో తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు లేదా ఇంకే ఎన్నికలో అయినా సరే మతాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందాలనే ఆలోచనలో బీజేపీ ప్రత్యేక అజెండా పెట్టుకున్నట్లు అర్ధమవుతున్నది. ఇదేసమయంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతు మతాన్ని అడ్డుపెట్టుకుంటే పార్టీ అధికారంలోకి రావటం సాధ్యంకాదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బండి పూర్తిగా హిందుత్వ అజెండాతోనే సాగించినా బీజేపీకి డిపాజిట్ కూడా రాని నేపద్యంలో ఈటల వ్యాఖ్యలు పార్టీలో కీలకంగా మారాయి. కుల, మత రాజకీయాలకు కాలంచెల్లిందని, అభివృద్ధి కేంద్రంగానే ఎన్నికల్లో జనాలు పార్టీలను ఆదరిస్తారని ఈటల అభిప్రాయపడ్డారు. బండి మాటలను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.