‘ఓవర్ లోడ్ వాహనాలు రెండో సారి పట్టుబడితే పర్మిట్ రద్దు’
రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం
By : The Federal
Update: 2025-11-22 13:59 GMT
ఓవర్ లోడ్‌తో ట్రావెల్ చేస్తున్న వాహనాలు రెండో సారి పట్టుబడితే వాహనం పర్మిట్ రద్దు చేయాలని రాష్ట్ర రవాణా శాఖమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఓవర్ లోడ్ వాహనాలు సీజ్ చేసే ముందు మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో అక్కడ మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని పర్మిట్ల రద్దు, లైసెస్స్ రద్దు చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
శనివారం రవాణా శాఖాధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం 33 జిల్లాస్థాయి బృందాలు, మూడు రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇందులో డీటీసీ, ఆర్టీఏ అధికారులు ఉన్నారని, వారు తనిఖీలు చేపడుతున్నారుని మంత్రి తెలిపారు. ఏ బృందం ఎక్కడ తనిఖీలు చేపడుతున్నారనే ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేయిస్తున్నట్లు చెప్పారు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ తనిఖీలు చేపట్టి నిబంధనలను ఉల్లంఘించిన 4,748 వాహనాల పై కేసులు నమోదు చేసింది. మొత్తం 3420 వాహనాలను సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు మమ్మురం చేయాలి’’ ఆయన ఆదేశించారు. ‘‘ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్ ఫోర్స్ మెంట్ పై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి , మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రమాదాలు ఓవర్ లోడ్ తో జరుగుతున్నాయని, ఈ విషయంలో అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన చెప్పారు. హెవీ వెహికిల్ డ్రైవర్ లైసన్స్ రెన్యూవల్ చేసే ముందు పునశ్చరణ తరగతులు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
‘‘గత సంవత్సరం రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు వచ్చాయి. వచ్చేజనవరిలో కూడా రోడ్డు భధ్రతా మాసోత్సవం నిర్వహించాలి’’ అని పొన్నం కోరారు. ఈ మాసోత్సవానికి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసు అధికారులకు అవగాహన కల్పించాలని పొన్నం ప్రభాకర్ అధికాలకు సూచించారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించింది.