కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా ?

తనచేతిలోని మీడియాబలంతో రేవంత్ ప్రభుత్వంపై బురదచల్లటమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది

Update: 2025-11-22 07:15 GMT
BRS working president KTR

రాజకీయాల్లో రాణించాలంటే లాజికల్ గా ఓర్పు, సమయస్పూర్తి, క్రెడిబులిటి చాలా అవసరం. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లో ఈ మూడు లక్షణాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే. తనచేతిలోని మీడియాబలంతో రేవంత్ ప్రభుత్వంపై బురదచల్లటమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతు పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ కుట్రచేస్తున్నారంటు ఆరోపించారు. పారిశ్రామిక అవసరాల కోసం 60 ఏళ్ళ క్రిందట కేటాయించిన భూములను ఇపుడు రేవంత్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నదంటు నానా గోలచేశారు. భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా రేవంత్ ప్రభుత్వం రు. 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి తెరలేపిందంటు ఆరోపణలు గుప్పించారు.

9,292 ఎకరాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తోందని ఎకరా భూమి రు. 50 కోట్లుంది కాబట్టి మొత్తం భూముల విలువ రు. 5 లక్షల కోట్లుంటుందని కేటీఆర్ అంచనా వేశారు. ఆ భూములను వాటి విలువలో 30 శాతానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో క్రమబద్ధీకరణ నిర్ణయాలు ఎవరికి లాభం చేకూర్చటానికి ? అంటు ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. ప్రజల ఆస్తులన్నింటినీ రేవంత్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తోందంటు నానా రచ్చచేశారు.

ఇక్కడే కేటీఆర్ లోని ఫ్రస్ట్రేషన్ బయటపడింది. కేటీఆర్ ఆరోపణలకు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. మంత్రి ఏమన్నారంటే భూముల క్రమబద్ధీకరణ జీవో ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనిచెప్పారు. ‘ఫ్రీహోల్డ్ రైట్స్’ పేరుతో 2023, ఆగస్టులో మూడు జీవోలను బీఆర్ఎస్ ప్రభుత్వమే జారీచేసిందన్న విషయాన్ని మంత్రి బయటపెట్టారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే ఇప్పుడు తమప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. 9,292 ఎకరాల్లో చదునుచేసి పరిశ్రమలకు కేటాయించింది 4,740 ఎకరాలని మంత్రి తెలిపారు. మిగిలిన భూములను మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. నిజంగానే ఈ భూముల్లో కుంభకోణం జరిగుంటే అది బీఆర్ఎస్ హయాంలోనే తప్ప తమ ప్రభుత్వంలో కాదని మంత్రి ఎద్దేవాచేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవహారంలో ఎన్ని లక్షల కోట్లరూపాయలు వసూలుచేసుకున్నారన్న విషయాన్ని చెప్పాలని కేటీఆర్ ను మంత్రి డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ప్రభుత్వం లక్షల కోట్లరూపాయల భూకుంభకోణానికి పాల్పడుతోందని బురదచల్లేసిన కేటీఆర్ అసలు దీనికి సంబంధించిన జీవోలు తమ హయాంలోనే జారీఅయినట్లు మాత్రం చెప్పలేదు. నిర్ణయం, జీవోల జారీ కేసీఆర్ హయాంలోనే జరిగినట్లు మంత్రి బయటపెడితే కాని అసలు విషయం తెలియలేదు. కన్వర్షన్ ఛార్జీల వల్ల ప్రభుత్వానికి వచ్చేదే సుమారు రు. 5 వేల కోట్లయినపుడు ఇక రు. 5 లక్షల కోట్ల భూకుంభకోణం ఎక్కడిదన్న ప్రశ్నకు కేటీఆర్ నుండి సమాధానం రావటంలేదు. తమ హయాంలో తీసుకున్న నిర్ణయం, జారీ అయిన జీవోల ప్రకారమే ఇపుడు రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళుతున్న విషయాన్ని కేటీఆర్ మీడియా సమావేశంలో దాచిపెట్టారు. తాను ఆరోపణలు చేయగానే ప్రభుత్వం నుండి అసలు విషయం బయటకు వస్తుందన్న ఆలోచన కేటీఆర్ లో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇదే కాదు సంక్షేమ హాస్టళ్ళ పరిస్ధితి, కలుషిత ఆహారంతో విద్యార్ధులకు అస్వస్ధత, రైతులకు సంకెళ్ళు, రైతులకు దొరకని మద్దతుధరలు లాంటి అనేక సమస్యలు ఇపుడే కాదు బీఆర్ఎస్ హయాంలో కూడా ఉన్నాయి. తమ పాలనంతా రామరాజ్యంలాగ రేవంత్ పాలన మొత్తం దుష్టపాలనలాగ కేటీఆర్ కలరింగ్ ఇస్తున్నారు. శాంతిభద్రతల సమస్యలు బీఆర్ఎస్ హయాంలో ఎలాగున్నాయో ఇపుడూ అలానే ఉన్నాయి. తమ హయాంలో అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణ ఇమేజి నాశనం అయిపోయినట్లు ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు తదితరులు గొంతుచించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రజల ఆస్తులను ప్రైవేటు పరంచేస్తోందంటు నానా గోలచేస్తున్న కేటీఆర్ 11 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ పార్టీఆఫీసుకు ఎలా కేటాయించుకున్నారో చెబితే బాగుంటుంది. అలాగే తమ హయాంలో ఎన్ని వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారనే విషయాన్ని కూడా వివరించాలి.

తమకు పదేళ్ళు అధికారాన్ని కట్టబెట్టిన జనాలే తమను ఓడించి కాంగ్రెస్ కు పట్టంకట్టారన్న విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు మరచిపోయారు. తమకు ఓట్లేసి అధికారం అప్పగిస్తే జనాలు తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు అలాకాకుండా ఓడిస్తే తప్పుచేసినట్లుగా జనాలకు శాపనార్ధాలు పెట్టడం కల్వకుంట్ల ఫ్యామిలీకే చెల్లింది. తాము తప్ప అధికారంలో ఎవరూ ఉండకూడదనే విపరీత ఆలోచనలు కేటీఆర్లో స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిరోజు తాను ఆరోపణలతో రెచ్చిపోవటమే కాకుండా తనకున్న మీడియా బలంతో ప్రభుత్వంపై బురదచల్లించేస్తున్నారు. బహుశా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓటమి కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ బాగా పెంచేస్తున్నట్లు అనుమానంగా ఉంది.

Tags:    

Similar News