‘‘ఆర్ఆర్ఆర్ భూసేకరణ రీసర్వే చేయాలి’
ఆర్ఆర్ఆర్ ఎంత అవసరమన్న దానిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామన్న కవిత.
ట్రిపుల్ ఆర్ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అసలు ఈ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను నాలుగు సార్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఎవరికీ తెలియడం లేదన్నారు. భూసేకరణ ప్రాంతంలో పేదల భూములు ఉండటం వల్లే ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను మార్చారని స్థానికులు అంటున్నారని పేర్కొన్నారు కవిత. రంగారెడ్డి జిల్లాలో జరిగిన జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్ అంశాన్ని కవిత లేవనెత్తారు. అంతేకాకుండా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని పునరుద్ఘాటించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి పోరాడుతోందన్నారు. ఈ సందర్బంగానే ప్రజలకున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని, అందులో ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ కూడా ఒకటని అన్నారు. ఈ అంశంపై అవసరమైతే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలుస్తామన్నారు.
‘‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూములు పోతున్నాయంటే తొమ్మిది రేకుల గ్రామానికి వెళ్లాం. నేను ఈ అంశానికి సంబంధించి అలైన్‌మెంట్ మారిందని మెదక్ లో మాట్లాడితే నా మీద విరుచుకుపడుతున్నారు. కానీ ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారింది. బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు, కాంగ్రెస్ వచ్చాక రెండుసార్లు మారింది. ఆలైన్ మెంట్ మారటం కారణంగా పేద, చిన్న రైతుల భూమి పోతోంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్కో చోట ఒక్క విధంగా ఆలైన్ మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారటానికి పెద్దోళ్ల భూములు ఉండటమేనని స్థానికులు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని అమన్ గల్, మాడుగుల మండలాల్లో సీఎం సోదరులు, అదే విధంగా మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు సంబంధించి భూములు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయి. నేను మొన్న చెప్పిన వారి భూములు ఉన్నాయని కూడా అంటున్నారు. అసలు ఆర్ఆర్ఆర్ మనకు ఎంత అవసరమన్న దానిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం. బాధితులందరినీ ఆయన దగ్గరకు తీసుకెళ్లి కలుస్తాం. చాలా అశాస్త్రీయంగా ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. మళ్లీ రీ సర్వే చేయాలని కోరుతాం’’ అని చెప్పారు.
‘‘ఇదే విషయంపై నితిన్ గడ్కరీ గారికి ముందుగా లేఖ కూడా రాస్తాను. అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో అన్యాయం జరగవద్దు. అవసరమైతే ఆరు నెలలు ఆలస్యమైన పర్వాలేదు. మళ్లీ సర్వే చేసి ప్రభుత్వ భూమి ఎక్కువ, ప్రజల భూములు తక్కువ ఉండే విధంగా చూడాలని కోరుతా. ఒరిజినల్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ను మెదక్ లో వంకర టింకర తిప్పారు. షాబాద్, షాద్ నగర్ లో కూడా అంతే చేశారు. మెదక్ లో కూడా 56 ఎకగరాలు 2025 లో మళ్లీ ఆలైన్ మెంట్ మార్చుతారేమో? ఈ విషయంలో కచ్చితంగా మేము లీగల్ ఫైట్ కూడా చేస్తాం’’ అని అన్నారు.