తెలంగాణ సరిహద్దు మంగపేటలో గుప్త నిధులు..!
వాటాల కోసం గొడవపడి ఐదుగురు అరెస్ట్.
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర సిరిపంచ గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దాని వాటాలు పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ములుగు ఆటో డ్రైవర్ గ్యాంగ్ తవ్వకాలు
తెలంగాణ ములుగు జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్‌కు మహారాష్ట్రలో ఒక ఇంటి యజమానికి పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆటో డ్రైవర్‌కు ఆ ఇంటి యజమాని ఫోన్ చేసి తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్టు సమాచారమిచ్చాడు. విషయం తెలియగానే ఆటో డ్రైవర్ మరో నలుగురుని తీసుకుని మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ సిరిపంచ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. వరుసగా ఐదు రోజుల పాటు తవ్వకాలు జరిగాయి. కాగా ఈ తవ్వకాలు జరిపే ముందు పూజలు చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఒక రాగి లంకె బిందె దొరికింది. అందులో భారీ ఎత్తున బంగారం దొరికింది. లంకెబిందలో దుష్ట శక్తి ఉందని తవ్వకాలు జరిపిన వారు ఇంటి యజమానికి చెప్పారు. తవ్వకాలను తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నారు. పూజలు చేసుకుని వస్తామని సిరిపంచ కు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగపేటకు తీసుకొచ్చారు. పూజలు చేశారు. కోళ్లు, మేకపోతులను లంకెబిందెకు బలి ఇచ్చారు.
ఈ క్రతువు పూర్తి కావడంతో తిరిగి సిరిపంచకు చేరుకున్నారు. ముందుగా మాట్లాడుకున్నట్టు రాగి లంకెబిందెను మళ్లీ అదే పూడికలో పాతి పెట్టారు. పూజలు చేసి మళ్లీ కోళ్లను బలిచ్చారు. లంకబిందెను వెలికి తీసి అందులో ఉన్న బంగారు నాణేలను లెక్కించారు. ఒక్కో నాణెం 22 తులాలు ఉంది. ఉన్న నాణేలను అందరూ పంచుకోవాలనుకుని యజమాని ఇంట్లో ఆటో డ్రైవర్ బృందం తిష్ట వేసింది. కానీ అందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. ‘‘మా తాతలు పాతి పెట్టిన రాగి లంకెబిందెను మీ కెందుకు ఇవ్వాలి’’ అని అన్నాడు. దాంతో వారిమధ్య గొడవ మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆటో డ్రైవర్ బృందం తెగేసి చెప్పింది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఇంటి యజమాని అనడంతో విషయం పోలీసులకు చేరింది. ఇంటి యజమానితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తప్పించుకున్నాడు. అయితే గతంలో కూడా సిరిపంచలో గుప్తనిధులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.