కేటీఆర్ ఇరుక్కున్న ‘ఫార్ములా’ కేసు పుర్వాపరాలివే

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవినీతి, అధికార దుర్వినియోగం స్పష్టంగా కళ్ళకు కనబడుతోంది

Update: 2025-11-21 08:08 GMT
KTR and Formula E car Race

బీఆర్ఎస్ పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓటమితో ఇబ్బందిపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై ఫార్ములా కేసులో(Formula E car Race) యాక్షన్ తీసుకునేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీ(Telangana ACB)కి అనుమతి ఇవ్వటం మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా తయారైంది. నిజానికి గవర్నర్ అనుమతి దాదాపు రెండునెలల క్రితమే రావాల్సుండగా అనుమతి ఫైల్ రాజ్ భవన్లో 70 రోజులు పెండింగులో ఉండి చివరకు గురువారం అనుమతి ఇచ్చారు. అతితొందరలోనే కేటీఆర్ పైన ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయటమా ? లేకపోతే ముందు అరెస్టుచేసి తర్వాత చార్జిషీటు దాఖలుచేయటమా అన్న విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పై రెండింటిలో ఏది జరిగినా బీఆర్ఎస్(BRS) కు నష్టమైతే ఖాయమనే అనిపిస్తోంది.

కేటీఆర్ మీద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు చేపడుతున్నట్లు మాజీమంత్రి హరీష్ రావు అండ్ కో గొంతుచించుకుంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవినీతి, అధికార దుర్వినియోగం స్పష్టంగా కళ్ళకు కనబడుతోంది. ఇదే విషయాన్ని ఏసీబీ హైకోర్టులో కూడా చెప్పింది. ఫార్ములా కేసు విషయంలో తనపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేకుండా కేటీఆర్ గతంలోనే కేసు వేశారు. ఆ కేసులో ఏసీబీ తన వాదన వినిపించింది. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత కేటీఆర్ దాఖలుచేసిన కేసును కోర్టు కొట్టేసింది. కేటీఆర్ కేసును కోర్టు కొట్టేసింది అంటే అర్ధం ఏసీబీ చూపించిన సాక్ష్యాలతో కోర్టు కన్వీన్స్ అయినట్లే కదా.

ఫార్ముల కేసులో కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలను ఏసీబీ గవర్నర్ కు కూడా అందించింది. ఏసీబీ చూపించిన సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత గవర్నర్ న్యాయనిపుణులతో కూడా చర్చించారు. అన్నీ కోణాల్లోను సాక్ష్యాలను పరిశీలించిన తర్వత అదికూడా 70 రోజుల తర్వాత యాక్షన్ కు అనుమతించారంటే కేటీఆర్ అవినీతి, అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని గవర్నర్ కూడా కన్వీన్స్ అయిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఎంత గోలచేసినా పెద్ద ఉపయోగమైతే ఉండదు. ఫార్ములా కేసులో కేటీఆర్ ఇరుక్కోవటం ఖాయమనే పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

అసలు కేసు ఎలాగ మొదలైంది ?

సరే, కేటీఆర్ భవిష్యత్తును పక్కనపెట్టేస్తే అసలు కేసు ఏమిటి ? ఎలాగ మొదలైంది ? అనే విషయాన్ని చూద్దాం. ఫార్ములా కార్ రేసు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వానిది కాదు. ప్రైవేటు వ్యక్తులకు వచ్చిన ఆలోచనలో ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకుని కోట్లరూపాయలు నష్టపోయింది. 2021 నవంబర్లో ప్రైవేటు వ్యక్తుల ఆలోచనలో నుండి పురుడుపోసుకున్నదే ఫార్ములా కార్ రేసు వ్యవహారం. హైదరాబాదులో కార్ రేసు నిర్వహించాలన్న ఆలోచన అంతర్జాతీయ క్రీడల కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావుదని ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో గువ్వాడ ఏ4గా ఉన్నారు. ఏసీబీ విచారణలో వెలుగుచూసిన అంశాల ప్రకారం గువ్వాడ తన మిత్రుడు దిల్ భాగ్ గిల్ తో ఫార్ములా రేసు నిర్వహణపై చర్చించారు. 2021, నవంబర్ 18వ తేదీన టీహబ్ లో ఒక ప్రజంటేషన్ జరిగింది. ఆ ప్రజంటేషన్లో గువ్వాడ, గిల్ పాల్గొన్నారు. ఆర్ధిక, వ్యాపారపరమైన సహకారం కోసం గ్రీన్ కో వ్యవస్ధాపకుడు చెలమలశెట్టి సునీల్ ను సంప్రదించారు. పై ఇద్దరు రెండోసారి సునీల్ ను కలిసినపుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆభేటీలోనే హైదరాబాదులో ఫార్ములా రేసు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.

ఏసీబీ నివేదికను బట్టిచూస్తే ఫార్ములా రేసు నిర్వహణతో హైదరాబాదుకు అంతర్జాతీయ ఇమేజి తెచ్చేందుకు తాను ప్రయత్నించినట్లు కేటీఆర్ చెప్పుకుంటున్నది అబద్ధమని తేలిపోయింది. ప్రైవేటు వ్యక్తుల ఆలోచనను కేటీఆర్ అమలుచేశారంతే. గువ్వాడ, గిల్, సునీల్ నుండి రేసు నిర్వహణ ప్రతిపాదన రాగానే కేటీఆర్ అంగీకరించేశారు. ఫార్ములా కార్ రేసును నిర్వహించాలంటే బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్ధ అంగీకారం అవసరం. అందుకని 2022, జనవరి 17వ తేదీన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్ధ సీఈవో అల్బెర్టో లాంగో ను అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సంప్రదించారు. ఖర్చులన్నీ ప్రభుత్వం భరించేట్లయితే హైదరాబాదులో రేసు నిర్వహణకు అభ్యంతరంలేదని అల్బెర్టో షరతు విధించారు. ఖర్చులన్నీ భరించేందుకు కేటీఆర్ నూరుశాతం హామీ ఇచ్చారు.

కేటీఆర్ నుండి హామీ రాగానే 2022, జనవరిలో అల్బెర్టోతో అర్వింద్+సునీల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. ఈకేసులో అల్బెర్టో ఏ5గా ఉన్నారు. అల్బెర్టోతో ఒప్పందంచేసుకునేందుకు అర్వింద్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవు. రేసు నిర్వహణకోసం సునీల్ ప్రత్యేకంగా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ అనే కొత్త సంస్ధను ఏర్పాటుచేశారు. రేసు నిర్వహణ బాధ్యతలను గువ్వాడ పర్యవేక్షించేట్లుగా ఒప్పందంజరిగింది. నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించినందుకు గువ్వాడకు నెక్స్ట్ జనరేషన్ సంస్ధ ఏడాదికి గువ్వాడకు రు. 1.9 కోట్లు వేతనం ఇచ్చేట్లుగా అంగీకారం అయ్యింది. కేటీఆర్ ఆదేశాల ప్రకారమే అర్వింద్ కుమార్ నిబంధనలకు పాతరేసి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడే అధికార దుర్వినియోగం, అవినీతి స్పష్టంగా బయటపడింది.

2023, ఫిబ్రవరిలో జరిగిన మొదటిరేసులో నెక్స్ట్ జెన్ సంస్ధకు రు. 175 కోట్లు నష్టం వచ్చింది. ఆర్ధికంగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్, ఎఫ్ ఈ వో పట్టించుకోలేదు. దాంతో సునీల్ కు మండిపోయి జరిగిన నష్టంచాలని తర్వాత నిర్వహించాల్సిన సీజన్-10 రేసు స్పాన్సర్ గా తప్పుకున్నారు. సీజన్-10 రేసు నిర్వహణ కోసం 2023, మేలోనే చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవటంతో రేసు నిర్వహణ నుండి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్ధ హైదరాబాదును తప్పించింది. హైదరాబాద్ ను తప్పించటాన్ని కేటీఆర్ ప్రిస్టేజిగా తీసుకున్నారు. వెంటనే అర్వింద్ కుమార్ ను రంగంలోకి దింపారు. అర్వింద్ హడావుడిగా హెచ్ఎండీఏ ప్రమోటర్ గా 2023, సెప్టెంబర్ 27వ తేదీన నోట్ ఫైల్ రెడీచేశారు. నోట్ ఫైల్ ప్రకారం అర్వింద్ ఫీజుల చెల్లింపు కోసం రు. 160 కోట్లు, ఇతరత్రా ఏర్పాట్ల కోసం మరో రు. 50 కోట్లు అంటే మొత్తం రు. 160 కోట్లు హెచ్ఎండీఏ ఖాతానుండి ఎఫ్ ఈ వో కంపెనీకి చెల్లించారు.


అధికార దుర్వనియోగం

రు. 160 కోట్ల చెల్లింపులో అర్వింద్ మున్సిపల్ శాఖ, ఆర్ధిక, న్యాయశాఖల అనుమతి తీసుకోలేదు. క్యాబినెట్ లో కూడా చర్చించకు పెట్టలేదు. విదేశీ సంస్ధలకు విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండానే ఫార్ముల కంపెనీకి అర్వింద్ హెచ్ఎండీఏ నుండి డాలర్లలో చెల్లింపులు చేశారు. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెప్పకుండానే కేటీఆర్ ఆదేశాల ప్రకారం అర్వింద్ నిధులు చెల్లించేశారు. తెలంగాణ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ను కేటీఆర్, అర్వింద్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. చెల్లింపులన్నీ కేటీఆర్ ఆదేశాల ప్రకారమే జరగటంతో ప్రభుత్వానికి రు. 160 కోట్లు నష్టం వచ్చింది ఏసీబీ గుర్తించింది. అయితే వివిధ కారణాల వల్ల సుమారు రు. 106 కోట్లు తిరిగి హెచ్ఎండీఏ ఖాతాలో జమవ్వటంతో నికరంగా ప్రభుత్వానికి రు. 54.88 కోట్లు నష్టం జరిగింది.

పై విషయాలన్నింటినీ ఏసీబీ విచారణలో బయటకు తీసింది. కేటీఆర్, అర్వింద్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ హోదాలో చెల్లింపులు చేసిన బీఎల్ఎన్ రెడ్డి, గువ్వాడ, గిల్, అల్బెర్టో తదితరులను విచారించినపుడు అనేక అంశాలను ఏసీబీ రాబట్టింది. అర్వింద్ ఆదేశాల ప్రకారం తాను బ్రిటన్ కంపెనీకి చెల్లింపులుచేసినట్లు బీఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నట్లు అర్వింద్ ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఫార్ములా రేసు నిర్వహణ ఆలోచన తమదే అని గువ్వాడ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. తాను అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినట్లుగా ఇంతమంది సాక్ష్యాధారాలున్నా ఇదొక లొట్టపీసు కేసని కేటీఆర్ పైకి ఎంత బింకం ప్రదర్శిస్తున్నట్లు అర్ధమవుతోంది. లోలోపల కేటీఆర్లో అరెస్టు టెన్షన్ పెరిగిపోతోందని అర్ధమవుతోంది. మూడు, నాలుగు రోజుల్లో ఏసీబీ యాక్షన్లోకి దిగవచ్చనే సంకేతాలు కనబడుతున్నాయి, దిగితే ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News