రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్
ఫార్ములా రేసింగ్‌లో తాను ఏ తప్పూ చేయలేదని కేటీఆర్ అన్నారు.
ఫార్ము ఈ-కార్ రేసు కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్ అనుమతించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా? అన్న చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై కేటీఆర్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. చట్టంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. గతంలో చెప్పినట్లుగానే ఈ-కార్ రేసు కేసులో లైడిటెక్టర్ టెస్ట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు ఎక్కడి రమ్మన్నా వస్తానని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ కలిసి నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఈ జాయింట్ వెంచర్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు 9,292 ఎకరాల భూమని కొట్టేయడానిక జరుగుతున్న ప్రయత్నాలే నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ తెలంగాణలో మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అన్ని లెక్కలు, అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. ఈ సందర్భంగానే తన అరెస్ట్ జరగదని కూడా క్లారిటీ ఇచ్చారు.
‘‘నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ చేయరు. ఈ-కార్ రేస్ కేసులో ఏం లేదు. ఆ విషయం రేవంత్‌కు కూడా తెలుసు. నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు భయపడతాను. లైడిటెక్టర్ టెస్ట్‌కు నేను ఎప్పుడూ రెడీ’’ అని పునరుద్ఘాటించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడటానికి దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
‘‘ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఉపఎన్నికలు వస్తాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసి దొరికిపోయారు. అనర్హత వేటు పడితే పరువు పోతుంది. అందుకే అతని చేత రాజీనామా చేయిస్తున్నారు. సాంకేతిక సాకులు చెప్పి కడియంను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ముందు గ్రేటర్ ఎన్నికలొస్తాయి’’ అని అన్నారు.