‘వారణాసి’ వివాదం రాజమౌళి స్ట్రాటజీనా..!

వరుస కేసులు నమోదవడం, సోషల్ మీడియాలో నెటిజన్స్ తిట్టడం అంతా కూడా జక్కన్న చెక్కిన ప్లానా..!

Update: 2025-11-20 12:50 GMT

 ‘వారణాసి’ వివాదాన్ని దర్శక ధీరుడు రాజమౌళినే కోరుకుంటున్నారా? అంతా పక్కా ప్లాన్‌గానే వివాదాన్ని రేకెత్తించాడా? అంటే అవునన్న వాదనే వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ పట్టినా అదే చర్చ జరుగుతుందని, దాని కోసమే రాజమౌళి ఇలాంటి ప్లాన్ రెడీ చేశాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందు సంఘాలు కొన్ని, కొందరు ప్రముఖ నేతలు కూడా రాజమౌళి సినిమాను హిందువులంతా బాయ్‌కాట్ చేయాలని పిలుపిస్తున్నారు. రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఫిలిమ్ ఛాంబర్‌కూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. హిందూ దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి కోట్లు అర్జిస్తూ.. ఆ దేవుళ్లనే కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్న క్రమంలో అసలు ఇదంతా కూడా జక్కన్న చెక్కిన ప్లానేనా అన్న చర్చ కూడా మొదలైంది. తన సినిమాలను ప్రజల్లో ఉండేలా చేయడంలో రాజమౌళిది మాస్టర్ బ్రెయిన్. ఏం చేసయినా తన సినిమా ప్రజల నోళ్లలో నానేలా చేస్తాడు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో ఇటువంటి విమర్శల టైప్ స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ఇప్పుడు ‘వారణాసి’కి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడా..!

జైళ్లో వేస్తే దేవుళ్ల పవర్ తెలుస్తుంది: రాజా సింగ్

తాజాగా ‘వారణాసి’ వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘాటుగా స్పందించారు. హిందువులంతా కూడా ‘వారణాసి’ సినిమాను చూడకుండా బాయ్‌కాట్ చేయాలన్నారు. ‘‘రాజమౌళిని జైళ్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థం అవుతుంది. హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకండి. హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు కానీ వాళ్ల మీద సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి. హిందూ బంధువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలి’’ అని రాజాసింగ్ కోరారు.

రాజమౌళిని ఆ దేవుడే మార్చాలి: బండి

రాజమౌళి వ్యాఖ్యల వివాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. రాజమౌళి నిండు నూరేళ్లు బ్రతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాని చెప్పారు. ‘‘దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

వానరసేన ఫిర్యాదు

రాష్ట్రీయ వానరసేన అనే సంఘం ఒకటి రాజమౌళిపై కొన్ని రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. హనుమంతుడిపై రాజమౌళి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి, ఆయన సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ తెప్పించుకొని, అధిక లాభాలు తెచ్చుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు సంపాదిస్తున్న సినీ రంగ ప్రముఖులు, కార్యక్రమాలలో ఇలాంటి ప్రసంగాలు చేసి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజమౌళిపై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని, లేదంటే వానర సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

ఆర్ఆర్ఆర్ టైమ్‌లో సేమ్ స్ట్రాటజీ..

రామ్‌చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్పుడు కూడా రాజమౌళి ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యాడు. ఆ సినిమా సమయంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం.. కాంబోపై పలు విమర్శలు వచ్చాయి. అసలు సంబంధం లేని ఇద్దరు వీరులను కలిపి చూపిస్తూ జక్కన్న చరిత్రను వక్రీకరిస్తున్నారన్న ఆరోపణలు భారీగానే వచ్చాయి. వాటిపై స్పందించిన రాజమౌళి.. సినిమా చూసిన తర్వాత ఈ విమర్శలపై వారికే క్లారిటీ వస్తుందంటూ ప్రమోషన్స్ చేసేసుకున్నారు.

ఇప్పుడూ అదే ఫార్ములానా..!

ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాకు కూడా జక్కన్న అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. కాకపోతే ఈసారి టార్గెట్‌గా తానే నిల్చున్నాడు. బహుశా వరల్డ్ క్లాస్ డైరెక్టర్ అంటూ స్టార్ హీరోలను మించి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడమే అందుకు కారణం కావొచ్చు. ఎందుకంటే తాను టార్గెట్ అయితే.. దాని ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. అందుకని నవంబర్ 15న జరిగిన గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్‌ వేదికగా తానే టార్గెట్ అవుతూ కామెంట్స్ చేసి.. ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీతో సినిమాను టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలబెడుతున్నారా? అన్న చర్చ బాగా వినిపిస్తోంది.

రాజమౌళి ఓ మాస్టర్ స్ట్రాటజిస్ట్..

రాజమౌళి తన తొలి సినిమా నుంచి కూడా ప్రమోషన్స్ విషయంలో అద్భుతమైన స్ట్రాటజిస్ట్‌గా నిలుస్తూ వచ్చాడు. ప్రతి సినిమాను సరికొత్త రీతిలో ప్రమోట్ చేయడంలో జక్కన్న రూటే సపరేటు. కానీ ‘బాహుబలి’ నుంచి మాత్రం రాజమౌళి స్ట్రాటజీలు నేషనల్ లెవెల్‌ రీచ్ అయ్యేలా మారాయి. వాటిలో సినిమాకు సంబంధించి షూటింగ్ లీకులు చిన్నచిన్నవి ఇవ్వడం, మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం, మూవీ టీమ్‌తో చిన్నిచిన్న ఆటలు ఆడించడం ఇలా చాలా స్ట్రాటజీలు చేస్తాడు జక్కన్న. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అప్పుడు ప్లాన్ ప్రకారమే, యాదృచ్ఛికంగానో నెగిటివ్ ప్రమోషన్ భారీగా జరిగింది. ఇప్పుడూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని కూడా అనిపిస్తోంది. అదే నిజమైతే ‘వారణాసి’ సినిమాకు ఈ స్ట్రాటజీ ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.

Tags:    

Similar News