2029లో రప్ప రప్పేనా ?
జగన్ ఫొటో పైన 2029 రప్ప రప్ప అంటు రాసిన పెద్ద పోస్టర్ వేలాడదీయటం జనాలను ఆకట్టుకుంది
కొంతకాలం క్రితం ఏపీ రాజకీయాలను అట్టుడికించేసిన రప్పా..రప్పా స్లోగన్ గురువారం హైదరాబాదులో కూడా వినిపించింది. దీనికి కారణం ఏమిటంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) హైదరాబాదు(Hyderabad)కు రావటమే. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు విచారణలో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఈరోజు జగన్ నాంపల్లిలోని సీబీఐ(Nampalli CBI Court) కోర్టుకు వచ్చారు. బేగంపేట్ విమానాశ్రయం నుండి జగన్ పెద్ద ర్యాలీగా కోర్టుకు చేరుకున్నారు. విచారణ ముగిసిన తర్వాత అక్కడినుండి లోటస్ పాండ్ లోని తనింటికి వెళ్ళారు.
ఎయిర్ పోర్టులో జగన్ విమానందిగి నేతలు, అభిమానులకు అభివాదం చేసుకుంటు విమానాశ్రయం బయటకు వచ్చారు. అప్పటికే వేలాదిసంఖ్యలో విమానాశ్రయం బయట వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా జిందాబాదులు కొట్టారు. ఈ సందర్భంగానే వరంగల్ కు చెందిన ఒక అభిమాని 2029 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వానికి రప్పా..రప్పా తప్పదంటు పెద్దగా అరిచి చెప్పారు. అలాగే ఒక భవనం మీద జగన్ ఫొటో పైన 2029 రప్ప రప్ప అంటు రాసిన పెద్ద పోస్టర్ వేలాడదీయటం జనాలను ఆకట్టుకుంది.
ఒకపుడు జగన్ పల్నాడు టూరులో రప్ప రప్ప అంటు అభిమానులు చేసిన వీరంగాలు, చూపించిన పోస్టర్లు రాజకీయంగా వైసీపీ-టీడీపీ మధ్య ఎంతటి వివాదానికి కారణమైందో అందరికీ తెలిసిందే. వారాలపాటు రప్ప రప్ప నినాదాల చుట్టూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య నానా రచ్చ జరిగింది. కూటమి ప్రభుత్వం రప్ప...రప్ప అంటు పోస్టర్లు వేసిన, స్లోగన్లు చేసిన వారిపై కేసులు నమోదుచేయటం బాగా వివాదాస్పదమైంది. తర్వాత ఏదో కారణంతో ఆ వివాదం సద్దుమణిగింది. అలాంటిది ఇపుడు సడెన్ గా జగన్ పర్యటనలో రప్ప..రప్ప అని అభిమానులు నినాదాలివ్వటం గమనార్హం. అప్పట్లో రప్ప...రప్ప స్లోగన్ ను జగన్ వెనకేసుకుని రావటంతో ఇపుడు మళ్ళీ అవే నినాదాలు వినిపించాయి.
కాకపోతే ఇక్కడ రాజకీయంగా వైసీపీ లేదు టీడీపీ కూడా లేదు. కాబట్టి ఈ నినాదాలు పెద్దగా రాజకీయంగా వివాదాలు రేకెత్తించలేదు. ఏదేమైనా ఉద్రిక్తతలు సృష్టించే నినాదాలు వినబడకుండా, కనబడకుండా కట్టడిచేయాల్సిన బాధ్యత అధినేతల మీదే ఉందనటంలో సందేహంలేదు.