ఫార్ములా కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం: హరీష్
ఫార్ములా రేసు పూర్తి పాదర్శకంగా జరిగినా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈకార్ రేసు కేసు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నీఛ రాజకీయ ఆటలని ఆరోపించారు. ‘‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది’’ అని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అందుకు ఇది అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. ‘‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం’’ అని హరీష్ అన్నారు.
‘‘పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని స్పష్టం చేశారు.
అసలు విషయం ఏంటంటే..
2023లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నుంచి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థ తప్పుకొన్న అనంతరమూ నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడం.. మంత్రివర్గం ఆమోదం పొందకపోవడం.. తదుపరి మూడేళ్లపాటు రేస్‌ల నిర్వహణకు రూ.600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అంతర్గత విచారణలో ప్రభుత్వం తప్పుపట్టింది. ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే రూ.54.88 కోట్ల మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.