కేటీఆర్ కు బిగ్ షాక్, విచారణకు గవర్నర్ అనుమతి

కేటీఆర్ అరెస్టయితే రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి

Update: 2025-11-20 05:28 GMT
KTR and ACB on formula E car race

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ అనేచెప్పాలి. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతిచ్చారు. గురువారం ఉదయం ప్రాసిక్యూషన్ కు సంబంధించిన ఫైలును గవర్నర్ క్లియర్ చేసి ఏసీబీ(Telangana ACB)కి పంపారు. ఫార్ముల ఈ కార్(Formula E case) రేసులో రు. 54 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై కేటీఆర్(KTR) పైన ఏసీబీ కేసునమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఏ1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపైన ఏ3గా ఏసీబీ కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే.

అవినీతి, అధికార దుర్వినియోగం లాంటి అనేక అభియోగాలను కేటీఆర్ పై ఏసీబీ నమోదుచేసింది. కేటీఆర్ మీద చార్జిషీటు దాఖలుచేయాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి అవసరం. అందుకనే 70 రోజుల క్రితం అనుమతి కోరుతు ఏసీబీ ఉన్నతాధికారులు గవర్నర్ కు ఫైల్ పంపారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి, సలహాలు తీసుకున్న తర్వాత కూడా గవర్నర్ చాలా రోజులు ఫైలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ వైఖరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మధ్య పెద్ద వివాదానికి దారితీసింది.

బీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కవ్వబట్టే కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఫైలుపై గవర్నర్ సంతకం పెట్టడంలేదంటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కారణాలు ఏవైనా చివరకు ఈరోజు కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ తాజా అనుమతితో తొందరలోనే ఏసీబీ ఉన్నతాధికారులు కేటీఆర్ పై చార్జిషీటు దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసును విచారణను నిలిపేయాలంటు కేటీఆర్ కోర్టులో కేసు దాఖలుచేసినా ఉపయోగంలేకపోయింది.

ఆర్ధికశాఖ, క్యాబినెట్ అనుమతి, రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తనిష్టారాజ్యంగా బ్రిటన్ కంపెనీ ఫార్ములా ఈ కంపెనీకి హెచ్ఎండీఏ నుండి 46 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో చెల్లించేశారు. కేటీఆర్ మొబైల్ వాట్సప్ ద్వారా ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను చెల్లింపులు చేసినట్లు అర్వింద్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నిర్వహించిన శాఖాపరమైన విచారణలోను, తర్వాత ఏసీబీ విచారణలోను అంగీకరించినట్లు సమాచారం. దాంతో కేటీఆర్ పై కేసు గట్టిగా బిగుసుకున్నది. తనపైన ఏసీబీ నమోదుచేసిన కేసు లొట్టిపిట్ట కేసుగా కేటీఆర్ పైకి బింకం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం టెన్షన్ తో ఉన్నట్లు అర్ధమవుతోంది.

కేటీఆర్ ను విచారించి చార్జిషీటు నమోదుచేయబోతున్న ఏసీబీ అర్వింద్ కుమార్ పైన కేసులు నమోదుచేయటానికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న డీవీపీటీకి లేఖ రాసింది. వారంరోజుల్లోపే కేటీఆర్ మీద ఏసీబీ చార్జీషీటు దాఖలుచేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ అరెస్టయితే రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News