కోవర్టులవల్లే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందా ?

ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత(Maganti Sunitha) ఓటమికి కారణం కోవర్టులే అని కార్యకర్తలు నిర్భయంగా చెప్పారు

Update: 2025-11-19 13:01 GMT
Jubilee Hills by poll review meeting

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓటమి బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నట్లే ఉంది. బుధవారం ఉపఎన్నిక ఫలితంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. (Jubilee Hills by poll)ఆ సమీక్షలో కార్యకర్తలు చెప్పింది విన్న కేటీఆర్(KTR) ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత(Maganti Sunitha) ఓటమికి కారణం కోవర్టులే అని కార్యకర్తలు నిర్భయంగా చెప్పారు. సమీక్ష తర్వాత తాను మాట్లాడాల్సింది మాట్లాడిన కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతు ఓటమికి కారణాలు చెప్పాలని అడిగారు.

కార్యకర్తలు మాట్లాడుతు కోవర్టులవల్లే పార్టీ అభ్యర్ధి ఉపఎన్నికలో ఓడిపోయినట్లు చెప్పారు. ఈ సమాధానాన్ని కేటీఆర్ బహుశా ఊహించుండరు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నేతల్లో చాలామంది ఉపఎన్నికను పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో గట్టిగా పనిచేసే ద్వితీయశ్రేణి నేతలు కరువైనట్లు చెప్పారు. స్ధానిక నేతలకు బయట జిల్లాల నుండి వచ్చిన నేతలకు మధ్య సమన్వయం కూడా లోపించిందని చెప్పారు. చివరగా కాంగ్రెస్ పార్టీ పోల్ మ్యానేజ్మెంటును పార్టీ సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవటమే ఓటమికి కారణమని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

కార్యకర్తలు చెప్పిన కారణాలతో కేటీఆర్ కు షాక్ కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నిరోజులుగా కేటీఆర్ చెబుతున్న కారణాలకు ఇపుడు కార్యకర్తలు చెప్పిన కారణాలకు అసలు పొంతనేలేదు. కేటీఆర్ ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంచేసిందని, దొంగఓట్లు వేయించుకున్నదని, ఓటర్లను భయపెట్టిందనే కారణాలనే చెబుతున్నారు. ఎన్నికలన్నాక ఇలాంటివన్నీ సహజమే అన్నవిషయాన్ని కేటీఆర్ మరచిపోయినట్లున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికలు ఎలాగ జరిగాయో మరచిపోయినట్లు నటిస్తున్నారు. కేటీఆర్ చెప్పని అసలు కారణాలను ఈరోజు కార్యకర్తలు నిర్భయంగా, బహిరంగంగా చెప్పటంతో షాక్ కొట్టినట్లయ్యింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేటీఆర్ పార్టీ ఆఫీసులో సమీక్షలు నిర్వహించారు. అప్పుడు కూడా నేతలు, కార్యకర్తలను మాట్లాడమంటే పార్టీ ఓటమికి నాయకత్వం, అభ్యర్ధులపైన వ్యతిరేకతే కారణమని చెప్పటంతో షాక్ తిన్నారు. కొన్నినియోజకవర్గాల్లో సమీక్షలు జరిపిన తర్వాత చివరకు సమీక్షలనే మానుకున్న విషయం అందరికీ తెలిసిందే.

Tags:    

Similar News