ఒక్కతప్పు వల్లే హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయాడా ?
హిడ్మా ఎన్ కౌంటర్(Hidma encounter) పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి
జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు మాడ్వీ హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోవటానికి కారణమైంది. మావోయిస్టుపార్టీలో అత్యంత ప్రముఖుడు, కీలక నేత మాడ్వీ హిడ్మా(Madvi Hidma) మంగళవారం ఎన్ కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్ కౌంటర్(Maoists encounter) పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టు(Maoist leader) నేతలు మరణించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ఏర్పాటైన దగ్గర నుండి వేలాదిమంది భద్రతా బలగాలు హిడ్మా కోసం దండకారణ్యంలోని అణువణువు జల్లెడపట్టి గాలిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సాలో విస్తరించిన అడవుల్లో హిడ్మాను పట్టుకోవటం లేదా ఎన్ కౌంటర్లో చంపటంకోసం భద్రతాదళాలు వెతకని చోటంటు లేదు.
అలాంటిది మారేడుమిల్లి అడవుల్లో భద్రతాదళాలకు మావోయిస్టు బృందం ఎదురుపడటం, కాల్పులు జరగి 19 మంది తప్పించుకోగా ఆరుగురు మరణించటం అందులో హిడ్మా ఉండటం చాలా ఆశ్చర్యంగాఉంది. ఏదేమైనా మావోయిస్టుపార్టీలో పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ(పీజీఎల్ఏ) అధినేత హిడ్మా మరణించటం అన్నది వాస్తవం. ఈ ఎన్ కౌంటర్ భూటకమని సీపీఐ కొత్తగూడెం ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావుతో పాటు హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్ కౌంటర్లో చనిపోవటానికి హిడ్మా చేసిన ఒక్క తప్పే కారణమని అర్ధమవుతోంది. ఇంతకీ అతనుచేసిన తప్పు ఏమిటంటే దండకారణ్యం అడవులను దాటి ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి రావటమే.
అవును, మారేడుమిల్లి అడువులు హిడ్మాకు పూర్తిగా కొత్త. దశాబ్దాలుగా హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఏపీలోని మారేడుమిల్లి అడువుల వైపు అడుగుపెట్టలేదు. ఏళ్ళతరబడి అతని కార్యస్ధానం అంతా దండకారణ్యం అడవులే. ఎందుకంటే దండకారణ్యం అడువుల్లోని అంగుళం అంగుళం హిడ్మాకు కొట్టినపిండి. దండకారణ్యం కొట్టినపిండి కావటమే కాకుండా అడవుల్లో నివసించే గొత్తికోయల్లో అపారమైన పట్టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గొత్తికోయల్లో హిడ్మాకు రాబిన్ హూడ్ ఇమేజుంది. భద్రతాదళాలు ఎంత ప్రయత్నించినా గొత్తికోయల ద్వారా హిడ్మా ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఈ కారణంగానే భద్రతాదళాల ఎన్ కౌంటర్ల నుండి హిడ్మా చాలాసార్లు తప్పించుకోగలిగాడు.
దండకారణ్యంలోని చెట్లు, పుట్టలు, కొండలు, బంకర్లు, కొండల్లోని గుహలంతా హిడ్మాకు బాగా తెలుసు. కర్రెగుట్టల అడువుల కూంబింగులో భద్రతాదళాలు ఈమధ్యనే రెండు పెద్దగుహలను గుర్తించారు. అందులోని ఒక గుహ సుమారు వెయ్యిమంది ఉండటానికి సరిపడినంత విశాలంగా ఉంది. బాహ్య ప్రపంచానికి తెలీని ఇలాంటి గుహలు కర్రెగుట్టలు, దండకారణ్యంలోని కీలక ప్రాంతమైన నేషనల్ పార్క్ అడవుల్లో కొన్ని వందలున్నట్లు సమాచారం. ఇలాంటి గుహలు హిడ్మాతో పాటు మావోయిస్టు పార్టీలోకి కీలకనేతల్లో కొందరికి మాత్రమే తెలుసు. అందుకనే మొదటిసారి భద్రతాదళాలు పెద్ద గుహలు రెండింటిని చూసి ఆశ్చర్యపోయారు.
ఇలాంటి దట్టమైన అడువులను వదిలేసి హిడ్మా తన భద్రతాదళంతో కలిసి మొదటిసారి ఏపీలోని మారేడుమిల్లి అడువుల్లోకి అడుగుపెట్టాడు. మారేడుమిల్లి అడవుల గురించి హిడ్మాకు తెలియకపోవటంతో స్ధానికంగా ఉన్న ఎవరో ఒకరిపైన ఆధారపడాల్సిందే. అడవుల గురించి హిడ్మాకు ఏమీ తెలీదు పైగా అడవుల్లోని గిరిజనులకు పూర్తిగా కొత్త. దక్షిణబస్తర్లో మావోయిస్టుపార్టీతో సంబంధంలేకుండా హిడ్మాకు గిరిజన గూడేల్లో సొంత నెట్ వర్కుంది. అందుకనే హిడ్మా ఎక్కడున్నాడు అన్న విషయంకూడా భద్రతాదళాలు ఇన్నిసంవత్సరాల్లో ఆచూకీ కూడా కనుక్కోలేకపోయాయి.
ఆపరేషన కగార్ దెబ్బకు మావోయిస్టు అగ్రనేతల్లో కొందరు చనిపోవటం, మరికొందరు లొంగిపోవటం తదితరాల వల్ల మావోయిస్టుపార్టీ బాగా బలహీనపడింది. దండకారణ్యంమీద భద్రతాదళాలు మెల్లిగా పట్టుసాధించటం మొదలుపెట్టాయి. ప్రతి ఐదుకిలోమీటర్లకు భద్రతాదళాలు ఒక బేస్ క్యాంపును ఏర్పాటుచేసుకుంటున్నాయి. ప్రతి బేస్ క్యాంపులోను అత్యంత ఆధునిక ఆయుధాలు, ద్రోన్లు, మొబైల్ టవర్ల ఏర్పాటుతో సుమారు 500 మంది సాయుధ సిబ్బంది క్యాంపులో ఉంటున్నారు. భద్రతాదళాలు ఎంతగా చొచ్చుకుని పోయాయంటే చివరకు హిడ్మా గ్రామం పూర్వర్తిలో కూడా మొబైల్ టవర్ ఏర్పాటుచేయటమే కాకుండా బేస్ క్యాంపును కూడా ఏర్పాటుచేసుకున్నాయి.
ఇలాంటి నేపధ్యంలోనే దండకారణ్యంలో ఉండలేక, వేరేదారిలేక తన భద్రతాదళంతో హిడ్మా మారేడుమిల్లి అడవుల్లోకి అడుగుపెట్టాడు. ఎన్నిరోజులక్రితం మారేడుమిల్లిలోని అడువుల్లోకి అడుగుపెట్టాడనే సమాచారం లేదుకాని మావోయిస్టులు పెద్దసంఖ్యలో ఉన్నారనే సమాచారం మాత్రం భద్రతాదళాలకు ఉప్పందింది. దాంతో హిడ్మా లాంటి అగ్రనేతలే ఉండచ్చన్న అనుమానంతో భద్రతాదళాలు పెద్దఎత్తున అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టారు. చివరకు భద్రతాదళాల శ్రమఫలించి మంగళవారం హిడ్మా ఎన్ కౌంటరయ్యాడు.