మక్కా బస్సు మంటలనుంచి పెళ్లి కోసమే షోయబ్ బయటపడ్డాడా?

మక్కా నుంచి తెచ్చిన బట్టలతో ఆయన పెళ్లి చేసుకోవలసి ఉంది. వాటికోసం పెళ్లి కూతురు కుటుంబం ఎదురచూస్తూ ఉంది

Update: 2025-11-18 12:59 GMT

24 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ షోయ‌బ్  బ‌స్సులో అంద‌రూ చ‌నిపోయినా ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన మృత్యుంజేయుడు. "ఆయ‌న అదృష్టంలో పెళ్ళి రాసి వుంది. అందుకే అత‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు,"అంటూ ఒకపక్క దుఃఖంతో  ఉన్నా రెండు కుటుంబాలు ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాయి. ఇందులోఒకటి సోయబ్ బంధువులయితే, మరొకటి సోయబ్ పెళ్లి సంబంధీకులు. ఇటీవ‌లే షోయ‌బ్‌కు ఎంగేజ్‌మెంట్ అయింది. ఈ ఆనందంతోనే ఆయన కుటుంబమంతా  ఉమ్రా యాత్రకు బయలు దేరారు.  ఉమ్రా యాత్ర నుంచి వ‌చ్చిన త‌రువాత పెళ్లి తేదీ  నిర్ణయించాల్సి ఉంది.  పెళ్ళి ఘ‌నంగా చేయ‌డానికి .షోయబ్‌ తండ్రి మహమ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్ ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. మ‌క్కా న‌గ‌రంలో పెళ్ళికి సంబంధించిన షాపింగ్ కూడా చేసుకున్నారు. అయితే, ఆయన కలలను  డిజిల్ టాంకర్ చిద్రం చేసింది. 

ఈ విషయాన్ని షోయ‌బ్ పెద్ద‌నాన్న మ‌హ్మ‌ద్ అబ్దుల్ ఖ‌లీల్ క‌న్నీళ్లు పెట్టుకుంటూ గ‌ద్గ‌ద స్వ‌రంతో 'ఫెడ‌ర‌ల్ తెలంగాణా'తో చెప్పారు. 

షోయ‌బ్ ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్నాడు. త‌న తండ్రి అబ్దుల్ ఖ‌దీర్‌కు ఫ‌ర్నిచ‌ర్ షాప్ వుంది. ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో వ‌ర్క్ షాప్ పెట్టుకున్నారు.  అయితే షోయ‌బ్ ఇంటీరియ‌ర్ డిజైన్ నేర్చుకున్నాడు. ఇళ్ల‌ల్లో, అపార్ట్‌మెంట్ల‌లో, ఆఫీస్లుల్లో ఇంటీరియ‌ర్ చేస్తూ బీజీగా వుంటున్నాడు. ఆదాయం కూడా బాగానే వ‌స్తుండ‌టంతో షోయ‌బ్‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  "మా కుటుంబం అంతా  జీవితంలో స్థిర‌ప‌డ్డాం. కాబ‌ట్టి అల్లాహాకు కృత‌జ్క్ష‌త‌లు చెప్పి, ఉమ్రా పూర్తి చేసుకుని వ‌చ్చిన త‌రువాత పెళ్ళి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఎంతో సంతోషంతో కుటుంబ‌స‌భ్యులు 8 మంది, ప‌క్కింటి వాళ్లు ఏడుగురు క‌లిసి గ్రూప్‌గా వెళ్ళాల‌నుకున్నారు. నవంబర్ 9 షోయబ్ కుటంబ సభ్యులు 8 మంది, పక్కి ంటిలో ఉన్న ఏడురుగు మొత్తం 15 మంది జెద్దా కి వెళ్లాల్సి ఉంది. అయితే, ఇందులోనలుగురికి వీసాసమస్య వచ్చింది. వారు ఆగిపోయారు. మిగిలిన పదకొండు మంది జెద్దా వెళ్లగలిగారు. ఇందులో షోయబ్, సోయబ్ తండ్రి, తల్లి, తాతయ్య లతో పాటు పక్కింటి నుంచి ఏడుగురు ఉన్నారు. మిగతా నలుగురు ఐదు రోజుల తర్వాత  మ‌క్కా వెళ్ళారని మ‌హ్మ‌ద్ అబ్దుల్ హ‌ఫీజ్  తెలిపారు.

Full View  

షోయ‌బ్ ఇంటికి వెళ్ళ‌డానికి ఫెడ‌ర‌ల్ తెలంగాణా టీం హ‌జ్ క‌మిటీ కార్యాల‌యంలో సంప్ర‌దించింది. "వాళ్ళ కుటుంబ‌స‌భ్యులు ఐదుగురు మ‌క్కా వెళ్ళ‌డానికి పాస్‌పోర్ట్‌లు ఇచ్చారు. అందులో ఇద్ద‌ర్ని ఫైన‌ల్ చేశాం. బుధ‌వారం తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు మృతుల బంధువులు 34 మందితో పాటు నలుగురు హ‌జ్ క‌మిటీకి చెందిన ఇద్ద‌రు అధికారులు జెద్దా బ‌య‌లుదేర‌నున్న‌ట్లు" హ‌జ్ క‌మిటీ ఇ.వో. ఎం.డి.స‌ఫీవుల్లా ‘ఫెడ‌ర‌ల్ తెలంగాణా’తో తెలిపారు.

షోయ‌బ్ ఇంటి అడ్ర‌స్ తీసుకున్న మేము ఆసిఫ్ న‌గ‌ర్ ప్రాంతంలోని జిర్రా న‌ట‌రాజ్ న‌గ‌ర్ కి వెళ్ళాం. ఈ ప్రాంతం పాత‌బ‌స్తీలో చాలా లోప‌లికి వుంది ఈ ప్రాంతం. మెయిన్ రోడ్ మీద వున్న మ‌సీదు వ‌ద్ద షోయ‌బ్ అడ్ర‌స్ అడిగాం. "నాయాబ్ స్వీట్ హౌస్ దాటి లోప‌లికి వెళ్లి హార్డ్ వేర్ వాళ్ళ ఇల్లు ఎక్క‌డ అని అడ‌గ‌మ‌ని" చెప్పారు.

అక్క‌డ షోయ‌బ్ తండ్రి ఖ‌దీర్  స్నేహితుడి కుటుంబం వుంది. ఆ ఇంట్లోనూ న‌లుగురు చ‌నిపోయారు. ఇంటి ముందు రోడ్డు పైన కుర్చీల్లో చుట్టాలు కూర్చుని వున్నారు. అందులో ఓ వ్య‌క్తి వ‌చ్చి మమ్మల్ని షోయ‌బ్ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్క‌డ దృశ్యం కూడా ద‌య‌నీయంగా వుంది. ఇంటి ముందు కుర్చీలు. వాటిపైన దీనంగా బందువులు. ప‌క్కింటిలో 7 గురు చ‌నిపోయారు. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ‌ల బంధువులు అంతే విషాదంతో ఉన్నారు...అయితే అంద‌రూ ఒకే మాట అంటున్నారు. "చ‌ని పోయిన మా బంధువుల్ని మ‌దీనాలో జ‌న్న‌తుల్ బ‌ఖీ స్మ‌శాన‌వాటిక‌లో పూడ్చాల‌ి. అంతా దేవుని ఇష్టం. మేం ఉమ్రా, హ‌జ్ యాత్ర‌కు వెళ్ళి న‌ప్పుడు చ‌నిపోవ‌డానికి సిద్ద‌ప‌డే రెండు బ‌ట్ట‌లు చుట్టుకుని కాబా ద‌ర్శ‌నానికి వెళుతాము" అని షోయ‌బ్ పెద్ద‌నాన్న గుర్తుచేసుకున్నారు.

పాత‌బ‌స్తీ జిర్రలోని న‌ట‌రాజ్‌న‌గ‌ర్‌లో విషాధ‌ఛాయ‌లు అలుముకున్నాయి. బంధువులు వ‌చ్చి ప‌లుక‌రించి వెళుతున్నారు. వ‌చ్చిన బంధువుల‌కు షోయ‌బ్ మ‌రో పెద్ద‌నాన్న మ‌హ్మ‌ద్ అబ్దుల్ హ‌ఫీజ్‌లతో క‌లిసి బంధువుల్ని ఓదారుస్తున్నారు. సౌదీ అరేబియా మ‌దీనాలోని జ‌ర్మ‌న్ ఆస్ప‌త్రిలో షోయ‌బ్ కోలుకుంటున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పార‌ని షోయ‌బ్ పెద్ద‌నాన్న మ‌హ్మ‌ద్ అబ్దుల్ ఖ‌లీల్ 'ఫెడ‌ర‌ల్ తెలంగాణా'తో చెప్పారు. ఈ ప్ర‌మాదంలో "షోయబ్‌ తండ్రి మహమ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్, తల్లి గౌసియా బేగం, తాత మహమ్మద్‌ మౌలానా మరణించారు. డ్రైవ‌ర్ ప‌క్క‌న కూర్చిని వున్న షోయ‌బ్ ఆ డ్రైవ‌ర్‌తో పాటే బ‌స్సులోంచి అద్దాలను పగలు గొట్టకుని ధైర్యంగా దూకి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.  మక్కా నుండి మదీనాకు ప్రయాణంలో షోయ‌బ్‌కు నిద్ర‌ప‌ట్ట‌లేదు. త‌న కుటుంబ స‌భ్యులు, ఇతర ప్రయాణీకులు నిద్రపోతుండగా డ్రైవర్ పక్కన ఉన్న సీటులోకి మారాడు షోయ‌బ్‌. కొన్ని క్షణాల తర్వాత, వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. ఈవిషయాన్ని షోయ‌బ్ అన్న మహమ్మద్‌ అబ్దుల్‌ స‌మీర్‌ మ‌క్కా నుంచి మాకు ఫోన్ చేసి చెప్పాడు," అని షోయ‌బ్ పెద్ద‌నాన్న అబ్దుల్ ఖ‌లీల్ చెప్పారు. 

"షోయ‌బ్ కి నిద్రరాకపోవడం, దానితో  డ్రైవ‌ర్ ప‌క్క‌ సీటులోకి మారడం వల్లే ప్రమాదం నుంచి బయపడ్డారు.  తొందరలో జ‌ర‌గాల్సిన పెళ్ళే అత‌న్ని ప్రాణాల్ని కాపాడింది,"  అని షోయ‌బ్ ఇంటి వ‌ద్ద కూర్చున్న బంధువులు మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News