ఐ బొమ్మ రవి కేసులో ఈడీ దర్యాప్తు
మనీలాండరింగ్ జరిగినట్టు అనుమానం
ఐ బొమ్మ రవి అంశంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈమేరకు కేసు వివరాలివ్వాలని హైదరాబాద్ సీపీకి మంగళవారం ఈడీ లేఖ రాసింది. ఐ-బొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందితుడు ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాల నుంచి పోలీసులు ఇప్పటికే రూ.3.5కోట్లు ఫ్రీజ్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే. విడుదలైన భారీ చిత్రాలు కొద్ది గంటల్లోనే ఐ బొమ్మలో ప్రేక్షకులు ఉచితంగా చూసే వారు. అయితే రవికి మాత్రం బెట్టింగ్ యాప్స్ నుంచి భారీ ప్రకటనలు వచ్చేవి. ప్రకటనల రూపంలో రవికి నిధులు అందినట్టు దర్యాప్తులో తేలింది. క్రిప్టోవాలెట్ నుంచి రవి ఎన్నారై ఖాతాకు నెలకు రూ.15లక్షలు బదిలీ అయ్యాయి. నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.
ఈడీ రంగంలో దిగడంతో ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన బ్యాంకు ఖాతాలకు కోట్లాది రూపాయలు జమ కావడంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది.