పత్తి రైతుల పాట్లు ప్రభుత్వానికి పట్టవా: కేటీఆర్
ప్రైవేటు వారితో కుమ్మక్కయ్యే రైతులను రేవంత్ సర్కార్ ఇబ్బంది పెడుతుందన్న మాజీ మంత్రి కేటీఆర్.
తెలంగాణ రైతుల పాట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్రంలోని పత్తి, మొక్కజొన్న రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కేటీఆర్.. పార్టీ నేతలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి, సోయా రైతులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు
దీంతో ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేవని అబద్ధాలు చెప్తోందని విమర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటే ఎందుకు మంగళవారం అదిలాబాద్ మార్కెట్ యార్డ్ ని బంద్ పెట్టారని ప్రశ్నించారు. మార్కెట్ యార్డులో రైతన్నలను కలుస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు కల్పించిందని నిలదీశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా పత్తి, సోయా రైతుల పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ కపాస్ మొబైల్ అప్లికేషన్ అని తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అంటున్నారని, మరి కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ అన్నిచోట్ల ఉండదని, మరి ఇలాంటి సందర్భంలో రైతన్నల పరిస్థితి ఏమిటో చెప్పాలని అడిగారు.
‘‘రాష్ట్రంలో భారీగా అకాల వర్షాలు పడినందువల్ల పత్తి తేమ శాతం ఎక్కువగా ఉన్నది. చలి కూడా గతంలో కంటే ఎక్కువగా ఉన్నది అందుకే పత్తిలో తేమశాతం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20-22% తేమ ఉన్న పంటను కూడా కొనిపించాము. కానీ ఇప్పుడు కేవలం 12% తేమ ఉంటే కూడా కొనుగోలు చేయమని చేతులు ఎత్తేసింది. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరు కనీసం అడిగే వారు కూడా లేరు. కనీసం ఇప్పటిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి రైతుల పంటను దోచుకుంటున్నది అని అనిపిస్తున్నది. లేకుంటే రైతన్నలకు ఎన్ని సమస్యలు వచ్చినా స్పందించకుండా ఉండదు’’ అని తెలిపారు.
‘‘కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు రైతుకు దక్కాల్సింది కానీ ఐదు ఆరు వేలు కూడా దక్కడం లేదు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. సొంత తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పంటలు బిడ్డలు అమ్మాలంటే కూడా కొనుగోలు చేయడం లేదు. పత్తి పంట ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొంటాము అనే ఒక అర్థరహితమైన నిబంధన పెట్టిర్రు. ఆదిలాబాద్ లో ఉన్న భూసార పరిస్థితుల వలన పది పదిహేను క్వింటాళ్ల వరకు ఎకరానికి పండుతుంది, మరి మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి. ఈరోజు మేము రైతన్నలను కలవడానికి వెళ్తున్నామని తెలుసుకున్న ప్రభుత్వం నాటకాలు మొదలుపెట్టారు’’ అని విమర్శించారు.
‘‘కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టిర్రు. కానీ నిన్న జరిగిన క్యాబినెట్లో 50%కు పైగా తెలంగాణ జిల్లాలో పండుతున్న పత్తి పంట పైన కనీసం మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సరఫరా నుంచి మొదలుకొని యూరియా సప్లయ్ దాకా చివరికి పంట అమ్మకానికి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో రైతన్నల పంటలు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా లేవు. దేశంలోనే అత్యుత్తమ పంటను పండించే రాష్ట్రం తెలంగాణ, కానీ ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టి రైతన్నలను పట్టించుకోవడం లేదు. దేశంలో అద్భుతమైన నాణ్యత కలిగిన పత్తి పంట పండుతుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేయించుకుంటుంది పైగా ఇప్పటిదాకా ఉన్న దిగుమతి సుంకాలన్నింటినీ ఎత్తివేసింది’’ అని చెప్పారు.
‘‘కేవలం ఇతర దేశాల్లోని సరఫరాదారులతో చేసుకున్న ఒప్పందాల కోసమే తేమశాతం, మొబైల్ అప్లికేషన్ ,ఎకరాకు 7 క్వింటాళ్ల వంటి అర్ధరహితమైన నిబంధనలు పెట్టి విదేశీ సరఫరాదారులతో చేతులు కలిపేందుకు దేశంలోని రైతన్నల నుంచి బిజెపి దేశంలోని రైతన్నల నుంచి పత్తి పంట కొనుగోలు చేయడం లేదు. కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా కేవలం ఎన్నికలు రాజకీయాల పైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం వలన ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పటిదాకా పత్తి కొనుగోలు చేయాలని కనీసం కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేదు. రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రకాల పోరాటాలను చేసేందుకు మా పార్టీ సంసిద్ధంగా ఉన్నది. పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు.
‘‘మొన్న ఆత్మహత్య చేసుకున్న హైదవ్ దీపక్ కుటుంబానికి పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం చేస్తాం. వెంటనే ప్రభుత్వం పంటల కొనుగోలు కోసం ఫింగర్ ప్రింట్ల నిబంధన, కేవలం 12 శాతం తేమ ఉండాలన్న నిబంధన, ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటామన్న నిబంధనలను వెంటనే ఎత్తివేయాలి. కిసాన్ కపాస్ యాప్ సంబంధం లేకుండా పంట కొనుగోలు చేయాలి. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతన్నలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతన్నకు ఎకరానికి రూ. 20000 చొప్పున కనీస నష్టపరిహారం చెల్లించాలి’’ అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈనెల 21న జరిగే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం ఆదిలాబాద్ లో రైతు సంఘాలు పార్టీలన్నీ కలిసి చేస్తున్న కార్యక్రమానికి రైతన్నలు కలిసి రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.