‘అర్బన్ నక్సలైట్లను నమ్మితే హిడ్మా గతే పడుతుంది’
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ పై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్
మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అర్బన్ నక్సలైట్లను నమ్ముకుంటే హిడ్మాకు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. అర్బన్ నక్సలైట్లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో పైరవీలు చేసుకుని వారి కుటుంబాలను బాగు చేసుకుంటున్నారన్నారు. అర్బన్ నక్సలైట్ల మాటలకు ప్రేరణ చెంది చాలా మంది యువత అడవి బాట పట్టి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ‘‘తుపాకులు ఉండాల్సింది దేశ సరిహద్దుల్లోని సైన్యం వద్ద, లేదా సమాజాన్ని రక్షించే పోలీసుల వద్ద మాత్రమే. ఎవరు పడితే వారు తుపాకులు పట్టుకుంటామంటే నరేంద్రమోదీ ప్రభుత్వం సహించదు. కేంద్ర మంత్రి అమిత్ షా ఒక మాటంటే అదే మాట మీద నిలబడతారు. అదే ఫైనల్. మరో నాలుగు నెలల్లో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’’ అని ప్రకటించారు.
వేములవాడ పర్యటనలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ఎపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్ అయిన హిడ్మా ఇన్నాళ్లు అడవుల్లో ఉండి ప్రస్తుతం నగరబాట పట్టే క్రమంలో ఎన్ కౌంటర్ అయినట్టు చెప్పారు.
హిడ్మా ఏం సాధించాడు, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు క్షేమంగా ఉన్నారన్నారు. తుపాకీ పట్టుకుని చర్చలు జరగాలంటే కుదరదని, బుల్లెట్‌ను నమ్ముకుంటే ఏం సాధించలేరని హితవు పలికారు. బ్యాలెట్ ను నమ్ముకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
‘ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ, చత్తీస్ గడ్ , ఒరిస్సా,మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టులు గత కొన్ని నెలలుగా ఎన్ కౌంటర్ అవుతున్నారు. వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్న కర్రెగుట్టల్లో నుంచి మావోయిస్టు అగ్రనేత హిడ్మా తప్పించుకుని మంగళవారం ఎన్ కౌంటర్ అయ్యారు. తెలంగాణ అడవులు సేఫ్ కాకపోవడంతో ఆయన ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ అని భావించి అల్లూరి సీతారామరాజు జిల్లా వెళ్లి హతమైనట్లు తెలుస్తోంది’’ అని అన్నారు.