తెలంగాణపై పవన్ కల్యాణ్ కన్నేశారా ?
కార్యకర్తలతో మాట్లాడుతు తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన(Janasena)పోటీచేస్తుందని ప్రకటించారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ మీద కన్నేశారా ? 2024 ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన 21 నియోజకవర్గాల్లోను గెలిచిన పవన్(Pawan Kalyan)దృష్టి ఇపుడు తెలంగాణ మీదకు మళ్ళినట్లు అర్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతు తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన(Janasena)పోటీచేస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని శ్రేణులతో రాజలింగం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పాల్గొంటుంది అనేందుకు నాందిగా ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నేతలు, కార్యకర్తలు ప్రచారంచేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రోడ్డుషోల్లో పాల్గొంటారని ప్రచారంజరిగినా ఎందుకనో ప్రచారంలో పాల్గొనలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ సమక్షంలో గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారంటే అర్ధమేంటి ? ఈ ప్రకటన పార్టీ అధ్యక్షుడు పవన్ కు తెలీకుండా జరిగే ఛాన్సేలేదు. పవన్ ఆమోదంతోనే రాజలింగం ఈ ప్రకటన చేసుంటానటంలో సందేహం అవసరంలేదు. ఏపీలో మాత్రమే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు తెలంగాణలో కాదు.
తెలంగాణలో రాజకీయంగా ఉనికి చాటుకోవాలని, బలపడాలని పవన్ కు బలమైన కోరిక ఉంది. అయితే జనసేనపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ కో ఆంధ్రాపార్టీగా బలమైన ముద్రవేయటమే కాకుండా జనాలను సెంటిమెంటుగా బాగా రెచ్చగొట్టారు. దీని ఫలితంగానే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసినా, పవన్ ప్రచారంచేసినా ఒక్కచోట కూడా అభ్యర్ధులకు డిపాజిట్ రాలేదు. ఇదేసమయంలో ఏపీలో కూటమిలో భాగస్వామిగా జనసేన కూడా అధికారంలోకి వచ్చింది. దాంతో తెలంగాణపైన పవన్ దృష్టి తగ్గించేశారు. అలాంటిది ఇంతకాలానికి తెలంగాణపైన ముఖ్యంగా హైదరాబాద్ పైన పవన్ కన్నుపడింది. అందుకనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలని పవన్ డిసైడ్ అయినట్లున్నారు. పవన్ ఆలోచనలే రాజలింగం ప్రకటన రూపంలో బయటకు వచ్చుండాలి. ఎన్నికల్లో ఎంతవరకు జనసేన ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే.