స్ధానికసంస్ధల ఎన్నికలే టార్గెట్
డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు.
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బుధవారం (BRS)పార్టీఆఫీసులో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కేటీఆర్(KTR) భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం, పార్టీ బలోపేతంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు అయిపోగానే పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు.
జూబ్లీహిల్స్ లోని 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒక్కో కేంద్రంలో పదిమంది చొప్పున 4 వేలమందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుండగా కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మాత్రమే ఎందుకుచెప్పారో అర్ధంకావటంలేదు. గతంలో నష్టపోయినచోటే పార్టీ తిరిగి పుంజుకోవాల్సిన అవసరాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ నొక్కిచెప్పారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుండాలన్నారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయానికి ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాలని నేతలను నిర్దేశించారు. తెలంగాణ భవన్ తలుపులు నేతలు, కార్యకర్తలకు ఎప్పుడూ తెరిచే ఉంటుందన్నారు. ఏకష్టం వచ్చినా పార్టీ నాయకత్వం నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ గోపీనాధ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గోపీనాధ్ భార్య మాగంటి సునీత గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడినట్లు అభినందించారు. కాకపోతే కాంగ్రెస్, బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. షేక్ పేట, ఎర్రగడ్డ డివిజన్లలో కాంగ్రెస్ పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసుకున్నట్లు మండిపడ్డారు.
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతు జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీ ఓడినంతమాత్రాన ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. పోరాటస్పూర్తితో పనిచేసిన నేతలు, కార్యకర్తలదే నైతిక విజయంగా హరీష్ చెప్పారు. 2024 పార్లమెంటు ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు 18 వేల ఓట్లు మాత్రమే వచ్చినా, తాజా ఉపఎన్నికలో పార్టీకి 75 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని హరీష్ గుర్తుచేశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా గెలిచుండచ్చు కాని నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతదే అన్నారు. మైనారిటీలో మద్దతు కోల్పోతున్నామని గ్రహించిన కాంగ్రెస్ చివరి నిముషంలో అజారుద్దీన్ కు మంత్రిపదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడప్పుడు అనైతికం, అధర్మం కూడా గెలుస్తుంటుందని హరీష్ ఎద్దేవా చేశారు. తొందరలోనే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయమని హరీష్ జోస్యంచెప్పారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో పాటు కొందరు ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.