పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై నివేదిక..
ప్రభుత్వానికి నివేదిక అందించిన డెడికేటెడ్ కమిషన్.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను అందించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 46శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాగా ఈ అంశం కోర్టులో ఉంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఈ అంశంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే నవంబర్ 17న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని మంత్రివర్గం నిశ్చయించుకుంది. ఈక్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను గురువారం అందించింది.
రిజర్వేషన్లు 50శాతం మించకూడదు
పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలుపుకుని 50శాతం మించకూడదని సిఫార్సు చేసింది కమిషన్. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఈ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 24న హైకోర్టులో జరగనున్న హైకోర్టు విచారణకు ముందే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 24-25 తేదీల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.