కేంద్ర విత్తనాల చట్టం వస్తే రైతు కంటే కార్పొరేట్లకే ఎక్కువ మేలా?

1966లో కేంద్ర విత్తన చట్టం తరువాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యిప్పటికీ మరో చట్టం చేయలేదు. ఇపుడు చేస్తూ, కార్పొరేట్ లకు పట్టాభిషేకం చేస్తున్నది.

Update: 2025-11-21 11:43 GMT

కేంద్రం తీసుకురావాలనుకుంటున్న విత్తనం చట్టం అమలులోకి వస్తే  రైతులకు వచ్చే ప్రయోజనాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు అందుతాయి. ఒక విధంగా అది కార్పొరేట్లకు పట్టాభిషేకం అవుతుందనే భావన రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం తీసుకురావానుకుంటున్న బిల్లు ముసాయిదాను ఇపుడు ప్రజాభిప్రాయం కోసం అందుబాటులో ఉంచారు. ఈబిల్లు రేపు చట్టమయితే, రైతు,వ్యవసాయం అనే మాటల అర్థాలే మారిపోతాయి. ఎందుకుంటే, వ్యవసాయానికి ఇచ్చిన నిర్వచనం లో హర్టికల్చర్ లో భాగంమయిన ఆకుకూరలు, కూరగాయలు, పూలను చేర్చలేదు.  రైతుకు ఇచ్చిన నిర్వచనాన్ని కంపెనీలు, ట్రస్ట్ లు వచ్చే విధంగా మార్చారు.  గురువారం ప్రజల ముందుకు వచ్చిన ఈ విత్తన బిల్లు ముసాయిదాపై డిసెంబర్ 11 లోపు సూచనలు పంపాలని కేంద్రం కోరింది.

కేంద్రం తొలిసారి 1966లో విత్తన చట్టం చేసింది. 1983 లో దీనికి కొన్ని సవరణలు చేసింది.అదే సీడ్ కంట్రలో ఆర్డర్. అది  మినహా మారుతున్న పరిస్థితుల కు అనుగుణంగా ఓ సమగ్ర విత్తన చట్టం చేయనేలేదు. అయితే, ఒక విత్తన చట్టం తెచ్చేందుకు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2004 నాటి ముసాయిదా ప్రతికి కొన్ని మార్పులు చేర్పులు చేసి, తెలంగాణ వచ్చాక 2019 విత్తన బిల్లు ముసాయిదాను ప్రకటించారు. అయితే, రైతు సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అది చట్టంరూపం తీసుకోలేకపోయింది.

ఇపుడు కేంద్రం 1966 విత్తనాల చట్టం, 1983 నాటి సీడ్ కంట్రోల్ ఆర్డర్  ల స్థానం లో ఇపుడు 2025 విత్తనచట్టం తీసుకువచ్చేందుకు  ముసాయిదా బిల్లు రూపొందించింది. రైతుల నుంచి దీనికి అభిప్రాాయాలుకోరుతూ ఉంది. కాని దీనికి చట్టానికి సవరణలు సూచించడం కాకుండా తెలంగాణ ప్రభుత్వమే  ఒక విత్తన చట్టం తేవాలని కొందరు రైతు నాయకులు ప్రతిపాదిస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన ముసాయిదా బిల్లు మీద  తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సదస్సు గురువారం నాడు ఒక సదస్సు నిర్వహించాయి. చట్టం లో తీసుకురావలసి మార్పుల గురించి, తెలంగాణకు ప్రత్యేక విత్తనం చట్టం ఉండాల్సిన అవసరం గురించి  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు రైతు సంఘాలు ఈ సమావేశం తరువాత ఒక వినతిపత్రం అందచేశాయి.

విత్తనాలకు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక మార్పులు వచ్చాయి. ప్రైవేటు రంగంలో విత్తన కంపెనీలు విపరీత లాభాలు సంపాదిస్తున్నాయి. బహుళ జాతి విత్తన కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అరు పెద్ద కంపెనీలు వాటి మధ్యన పోటీ తగ్గించుకోవటానికి విలీనాల మూలంగా ఇప్పుడు మూడు అయినాయి.

విత్తనాలు, విష రసాయనాల వ్యాపారం జోడు గుర్రాలుగా వాడుకుంటూ దానికి తగిన శాస్త్ర సాంకేతిక జ్ఞానం జోడిస్తూ. అనుకూల శాస్త్రవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో కంపెనీలు విపరీత వేగంతో ఎదుగుతున్న పరిస్థితులలో, విత్తన వ్యాపారం మీద నియంత్రణ కోరుతున్న రైతు పక్ష సంఘాల ఒత్తిడి మేరకు ఈ ముసాయిదా వచ్చిందని సభలో ప్రవేశపెట్టిన ఒక పత్రంలో పేర్కొన్నారు. 

సభలో విధాన విశ్లేషకులు, డా. దొంతి నరసింహ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఈ చట్టాన్ని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో భాగంగా తెస్తున్నట్టు చెప్పారు. ఇంద దులో ఎదురయ్యే సమస్యలను శిక్షార్హం కాకుండా చేస్తామని ప్రకటించి తను ఎటు వైపు వుందో ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని అన్నారు.

“వ్యవసాయానికి నిర్వచనం లో హర్టీకల్చర్ లో భాగం అయిన ఆకుకూరలు, కూరగాయలు, పూలను చేర్చలేదు. వాటి విత్తనాలు ధరలు నాణ్యత పైనా అదుపు వుండదు. రైతుకు ఇచ్చిన నిర్వచనంలో కంపెనీలు, ట్రస్ట్ లు వచ్చే విధంగా వుంది. దీని వలన అవి రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు పొందుతాయి. వాళ్ళకు యిచ్చిన రుణాలు రైతులకు యిచ్చిన రుణాలుగా బ్యాంకులు చూపుకునే అవకాశం వస్తుంది. యిది రైతులకు నష్టం. అలాగే డీలర్ ను డిస్ట్రీబ్యూటర్ లను వేరు వేరుగా ఎందుకు చూస్తోందో స్పష్టత లేదు. యికపోతే విత్తనాన్ని ఒక రాష్ట్రం కంటే ఎక్కువ పరిధిలో సాగుచేస్తే దానిని నేషనల్ వెరైటీ పేరుతో ఎక్కడ అయిన అమ్ముకునే వెసులుబాటు కల్పించడం వలన రైతులకు నష్టం జరుగుతుంది. విత్తనానికి నిర్వచనం లో కృత్రిమ (synthetic seeds) విత్తనం అని కూడా రాశారు. ఈ పదం వాడి జన్యుమార్పిడి విత్తనాలను తెచ్చే ఆలోచన వుంటే మార్చుకోవాలి, దీని పైన స్పష్టత యివ్వాలి,” అని అన్నారు.

"కేంద్రం ఏర్పాటు చేసే 27 మంది విత్తన కమిటీ లో రొటేషన్ పద్దతిలో రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రతినిధులు మాత్రమే వుంటారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యం కుదించారు. ప్రతినిధులను ఎన్నుకోవటానికి ఏ ప్రాతిపదిక పైన జోన్లను విభజించారు అనేది స్పష్టత లేదు. దీనివలన కంపెనీలు కేంద్రం దగ్గర మాత్రమే లాబీ చేసుకుని పరిస్థితి ని తమకు అనుకూలంగా చేసుకోవటానికి ఉపయోగ పడుతుంది. దేశం లో ఏడు రకాల వాతావరణ జోన్ (climatic zones) లు వున్నాయి. విత్తనాలను ఆయా జోన్లలో విడివిడి గా పరీక్ష చేసి విడుదల చేయాలి. విదేశీ సర్టిఫికేట్ లను అంగీకరించకూడదు. మన ICAR ఆధ్వర్యం లో పరీక్షలు చేసి విత్తనాలు మన వాతావరణానికి అనుకూలమా కాదా అనేది చూడాలి. లేకపోతే మనకు ఇన్ని విశ్వవిద్యాలయాలు సైంటిస్టు లు ఎందుకు," అని ఆయన అన్నారు. మరింతదారుణం కేంద్ర విత్తన కమిటీ కూడా ఎమర్జెన్సీ లో మాత్రమే సమీక్ష చేయాలని వుంది, ఇది దారుణం అని వ్యాఖ్యానించారు. 

"విత్తన వ్యాపారం దేశం లో రు. 30,000 కోట్లు. యిక నకిలీ, నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే దాన్ని మైనర్ నేరం గా కేంద్ర చట్టం చూస్తోంది. విత్తన నియంత్రణ రాష్ట్ర పరిధిలో ఉండి, వాటికే ఎక్కువ అధికారాలు వుండాలని, నష్టపోయిన రైతులకు పరిహారం యివ్వాలని, విత్తనాల ధరల పైన అదుపు ఉండాలి," అని రైతు సంఘాలు అభిప్రాయ పడ్డాయి.

ఈ చట్టం జి-7 దేశాల ఒత్తిడి కి లొంగి చేశారని అన్నీ రంగాలలో ప్రధాని మోదీ లొంగిపోయారని అఖిల భారత కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లా రెడ్డి అన్నారు.

"2017 లో కెసిఆర్ ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే కేంద్రం అడ్డుకుంది. దేశం లో వాడే విత్తనాలలో 65 శాతం మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతాయి అయినా మనకు రాష్ట్రం లో చట్టం లేదు. వ్యవసాయం రాష్ట్ర పరిధి లో వుంది కాబట్టి విత్తనం పైన చట్టం చేసే హక్కు రాష్ట్రానికే వుంది కానీ కేంద్రం ఆ హక్కును లాక్కునే ప్రయత్నం చేస్తోంది. విదేశాల నుండి వచ్చే విత్తనాలను కొద్ది రోజులు నియంత్రణలో వుంచి బయటి నుండి హానికరమైన క్రిములు, మొక్కలు ఏవి దేశం లోకి రాకుండా చూడాలి," అని అన్నారు.

రైతు స్వరాజ్య వేదిక నాయకులు రవి కన్నెగంటి మాట్లాడుతూ కేంద్రం 2020 లో వెనక్కు తీసుకున్న మూడు నల్ల చట్టాలను జాతీయ సహకార విధానం, మార్కెటింగ్, విత్తన విధానాల పేరుతో వాటినే అమలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. “రాష్ట్రం కూడా విత్తన చట్టం తేవటానికి ఒక కమిటీ వేసింది. రాజ్యాంగం ప్రకారం విత్తన పరిశోధన రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, కేవీకే లు మనకు అందుకే వున్నాయి. రాష్ట్ర పరిధి లో వ్యవసాయం వుంది కాబట్టి ధరల నియంత్రణకు మార్కెటింగ్ కమిటీలు వాటి ద్వారా ధరల నియంత్రణ, వ్యవసాయ విద్యకు విశ్వవిద్యాలయాలు దాని పరిధి లో వుంటాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తన భాద్యతగా గుర్తించి పని చేసి వుంటే కేంద్ర విధానాలను తిరస్కరించే ధైర్యం దానికి వుండేది. కేంద్రం మనం పంపే సవరణలు అంగీకరించే అవకాశం లేదు. రాష్ట్రం తన స్వంత విత్తన చట్టం చేసి కేంద్రానికి పంపాలి. సవరణలు అడిగితే కేంద్ర పరిధిని అంగీకరించినట్టు అవుతుంది. చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో లో కూడా పెట్టింది,” అని గుర్తు చేశారు.

ఈ చర్చను విత్తన కార్పొరేషన్ పెడితే వ్యవసాయ కమిషన్ ప్రతినిధులు లేరు. వ్యవసాయ శాఖ తనకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి యిప్పుడు ఆయిల్ పామ్ మొక్కలు వస్తున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ కొరినట్టు మొక్కజొన్న దిగుమతి అయితే జన్యు మార్పిడి విత్తనం వాటితో పాటు రాదు అనే భరోసా వుంటుందా. వచ్చాక విత్తనం గా వాడకం కాకుండా వుంటుందా. రాష్ట్రం విత్తన కార్పొరేషన్ ను బలోపేతం చేయాలి. రాష్ట్రం లో 600 FPO లు 900 సహకార సంఘాలు వున్నాయి. వాటి పరిధిలో 40 నుండి 50 లక్షల మంది రైతులు వున్నారు వారికి శిక్షణ యిచ్చి విత్తన ఉత్పత్తి చెయ్యచ్చు. రాష్ట్రం దైర్యం చేసి వర్శిటీల వద్ద ఉన్న విత్తనం ఉపయోగించి సహకార సంఘాల ద్వారా పని చేసి మన విత్తన అవసరాలు తీర్చుకోవచ్చు. వాటికి తగిన నిధులు యిచ్చి ఈ పనిచేయాలి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు నిధులు లేక విత్తనాలను కంపెనీలకు అమ్ముకుంటున్నాయి. విత్తన సహకార సంఘాలను పునరుద్దరించచ్చు. ఒకప్పుడు విత్తన గ్రామ పథకం ఒకటి ఉండేది. మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ సోయా బీన్ పంట కు సహకార సంఘాల ద్వారా విత్తనాలు యిచ్చారు, అని రవి గుర్తు చేశారు. కేంద్రం మీద బహిరంగంగా కొట్లాడాల్సిన పనిలేదు. రైతులను, విత్తన సహకార సంఘాలను, విత్తన కార్పొరేషన్ ను పురికొల్పి స్వతంత్రంగా పని చేసి విత్తన అవసరాలు తీర్చుకోవాలి కానీ ఆపని చేయటానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదు.

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) నకిలీ విత్తనాలను అరికట్టటంలో తమకు అధికారాలు యిస్తే మెరుగైన ఫలితాలు వుంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం వున్న 1966 చట్టం అధికారాలను మండల స్థాయి వ్యవసాయ అధికారికి పరిమితం చేసింది. “మేము ప్రతి మండలానికి 4 నుండి 6 మంది వున్నాము. మాకు వాటి పంపిణీ, వాడకం తెలిసే అవకాశం ఎక్కువ. మా నేతృత్వం లో సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పోలీస్ అధికారి ఆధ్వర్యం లో ఒక కమిటీ ఏర్పాటు చేసి నిఘా పెడితే నకిలీ విత్తనాలు అరికట్ట వచ్చు అని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పారు.

Tags:    

Similar News