మరి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ ఎక్కడున్నట్టు?
మా దగ్గర లేడన్న పోలీసులు, జోక్యం చేసుకోలేమన్న కోర్టు, వాళ్ల వద్దే ఉన్నాడంటున్న ప్రజాసంఘాలు
By : The Federal
Update: 2025-11-21 13:50 GMT
సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ పోలీసుల దగ్గరున్నారనే దానికి ఆధారాలు లేవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పిది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కూడా శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారన్న దానిపై చర్చ మొదలైంది. సీపీఐ, సీపీఎం సహా వివిధ ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని వాదిస్తున్నాయి. ఈమేరకు సంయుక్త ప్రకటన కూడా చేశాయి.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయనకు ఏమైందనే అంశంపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో హైకోర్టలో హేబియస్ పిటీషన్ దాఖలైంది. దానిపై రెండు రోజులుగా సాగిన విచారణ శుక్రవారం ముగిసింది. తమ అదుపులో లేరని ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు విన్నవించారు.
ఇంతకీ ఎవరీ దేవ్ జీ? ఆయన విషయంలో అంత చర్చ ఎందుకు జరుగుతోంది?
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు అనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని, అందువల్ల ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆధారాలు లభిస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. దేవ్‌జీ, రాజిరెడ్డిలను హైకోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి గంగాధర్, హైదరాబాద్‌కు చెందిన మల్లా స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది జై భీమారావు వాదనలు వినిపించారు. ‘ఈ నెల 18న మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దేవ్‌జీ, రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించండి. పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నామని ప్రకటన చేశారు. ఆ వీడియోను కోర్టు ముందు ఉంచుతాం’ అని తెలిపారు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
గురువారం జరిగిన విచారణలో ఆధారాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్ల తరుపు న్యాయవాది సమర్పించిన వీడియోలో సెక్యూరిటి సిబ్బంది తమ అదుపులో ఉన్నారని మాత్రమే పోలీసులు చెప్పినట్లు ధర్మాసనం గుర్తించింది. దేవ్‌జీ గురించి విలేఖరులు అడిగినపుడు పోలీసులు - తమ ఆదీనంలో లేరని- చెప్పినట్టుగా కోర్టు గుర్తించింది. దీంతో దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల నిర్భందంలో ఉన్నట్లు ప్రాధమిక ఆధారాలు లేవని నిర్ధారించిన న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ తరుణంలో మావోయిస్టు పార్టీలు నేతలు ఏమయ్యారనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అసలింతకీ ఈ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి ఎవరు? వీళ్లిద్దరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు. పార్టీకి ఇప్పటికి మిగిలిన ఏడుగురిలో వీరిద్దరూ ప్రముఖులు.
మావోయిస్టుల కోసం ఓడిశా, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను కేంద్రం వేగవంతం చేసింది. కేంద్ర దళాలు భారీ ఎత్తున గాలిస్తున్నాయ. ఇదే సమయంలో మావోయిస్టుల కీలక నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద కుదుపు. ఈ నేపథ్యంలోనే తిప్పరి తిరుపతి ఎలియాస్ దేవ్ జీ పోలీసులు అదుపులో ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. కానీ ఈ వార్తను ఏ రాష్ట్రం, ఏ కేంద్ర సంస్థా అధికారికంగా ధృవీకరించలేదు.
దేవ్ జీ ఎక్కడ?
ఇటీవల ఓయామ్ లఖ్ము అనే PLGA సభ్యుడు లొంగిపోయాడు. ఆయన 60 మంది ఉన్న బెటాలియన్ సభ్యల కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిలో దేవ్ జీ సమాచారం కూడా ఉండి ఉండవచ్చునని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంలో ఉన్న నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి. అంతకు ముందు ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఈ ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించారు. ఆ తరువాత దేవ్ జీ ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆయన తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వారు. దళితుడు. మాదిగ కుటుంబం నుంచి వచ్చారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతుండగానే విప్లవ విద్యార్థి రాజకీయాలవైపు వెళ్లారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు)లో చేరారు. కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ కి వెళ్లి నక్సలైట్లతో కలిసి పని చేయడం ప్రారంభించారు.
1982లో చరిత్రాత్మక రైతు కూలీ సంఘం మహాసభను ఈయనే నిర్వహించారు. పార్టీపై నిషేధ కాలంలో తిరుపతి మహారాష్ట్ర వెళ్లారు. సుదీర్ఘకాలం గడ్చిరోలిలో పనిచేశారు. 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు.
1990ల మధ్య వరకు పార్టీ నిర్మాణంలో ఉన్న దేవ్ జీ, తరువాత మిలటరీ విభాగాల వైపు మళ్ళారు. అప్పటి నుంచి పార్టీ సాయుధ విభాగాల్లో ఉన్నారు.
మావోయిస్టు పార్టీతో నక్సలైట్లు విలీనం అయిన తర్వాత దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన తొలి దళానికి ఈయనే కమాండర్. సెంట్రల్ కమిటీతో పాటు, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ)లోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయనకు దేవ్ జీ తో పాటు అనేక మారుపేర్లు ఉన్నాయి. సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతోనూ ఆయన పనిచేశారు.
2004-2005 నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అనేక దాడులకు ఆయనే నాయకత్వం వహించినట్టు చెబుతారు. పార్టీ క్యాడర్ కు సాయుధ శిక్షణ ఇవ్వడంలో ఆయన దిట్ట అంటుంటారు.
మా బాబాయి పేరు వింటుంటేనే...
దేవ్ జీ ఏమయ్యారనే దానిపై వివిధ రాజకీయపార్టీలతో పాటు కోరుట్లలోన ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటీషన్ వేసింది కూడా ఆయన సోదరుని కుమారుడు తిప్పిరి గంగాధర్. పోలీసుల అదుపులో ఉంటే ఎలాంటి హానీ తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. ఇప్పుడు తనకు మిగిలిందల్లా మా బాబాయి తిరుపతి క్షేమంగా ఉండాలని కోరుకోవడం తప్ప మరేమీ లేదు అని గంగాధర్ స్థానిక మీడియాతో చెప్పారు.
ఆమధ్య ఆయన తమ్ముడి కూతురి పేరిట తిప్పిరి సుమ అనే ఆమె ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. దేవ్ జీ లొంగిపోవాలంటూ కోరారు. అందులో ఆమె 'మీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాలో తెలియని గర్వం, బాధ కలుగుతాయి. మీ ధైర్యం, పట్టుదల నాలో ఎన్నో ఆలోచనలు కలిగిస్తాయి. మీరు సమసమాజ నిర్మాణం కోసం వెళ్లారు. ఇటీవలి సంఘటనలు చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని సుమ ఆ లేఖలో రాసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఆయన ఆచూకీ తెలియకుండా పోయి ఇప్పటికే మూడు రోజులు దాటింది. దీంతో తిరుపతి, రాజిరెడ్డి ఆచూకీపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సీపీఐ సీనియర్ నేత కె.రామకృష్ణ అన్నారు.