చెంచుల కోసం తండాకే వెళ్లిన నల్గొండ జిల్లా కలెక్టర్

ఉదయం 8 గంటలకే జిల్లా అధికార యంత్రాంగం తో సహా నెల్లికల్ చెంచు వాని తండా సందర్శన. రాష్ట్రంలోనే మొదటిసారిగా మారుమూల తండాలో ఆధార్, మీసేవ క్యాంపు నిర్వహణ

Update: 2025-11-22 03:12 GMT
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్ చెంచు వాని తండా ప్రజలతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఒక మహిళ దరఖాస్తుతో నల్గొండ జిల్లా యంత్రంగం మొత్తం మారుమూల చెంచు తండాకు తరలి వెళ్ళింది. దీనికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాయకత్వం వహించారు.

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్ చెంచు వాని తండా కు చెందిన ఆదెమ్మ ఒక పిటీషన్ ను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ ధ్రువపత్రాలు లేనందున తమ తాండవాసులందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని,మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందటం లేదని పేర్కొంది.

ఈ విషయాన్ని సావధానంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళ సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచు వాని తండాకే వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు.వెంటనే నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో మాట్లాడి చెంచులు సమస్యల పరిష్కారానికి నెల్లికల్ చెంచువాని తండాకి వెల్దామని,అందుకు సమయం కేటాయించాలని కోరారు. అందుకు ఎం ఎల్ ఏ జయవీర్ రెడ్డి అంగీకరించడంతో శుక్రవారం ఉదయం 8 గంటలకే జిల్లా కలెక్టర్ , జిల్లా అధికారులతో సహా శాసనసభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డితో కలిసి నెల్లికల్ చెంచుతాండకి చేరుకున్నారు.

ఉదయమే తమ తండా కు వచ్చిన జిల్లా కలెక్టర్ ,ఎం ఎల్ ఏ లను చూసి చెంచు ప్రజలు సంతోషం తో స్వాగతం పాలికారు.

చెంచు వాని తండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సావధానంగా విన్నారు.అంతేకాక సమస్యల పరిష్కారానికి సైతం మార్గాలు సూచించారు.

తమ తండాలో కొంతమందికి ఆధార్ కార్డులు లేవని ,ఆధార్ కార్డులు ఉన్నవారికి అప్డేషన్ లేనందున తాము ఎలాంటి పథకాలకి అర్హులం కాకుండా పోయామని, తాగునీటి బోరు మరమ్మతు చేయించాలని,పిల్లలు ఎక్కువగా ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న 6 కేజీల బియ్యం సరిపోవడం లేదని ,అంత్యోదయ అన్న యోజన కింద 32 కిలోల బియ్యం ఇవ్వాలని, కొంతమందికి రేషన్ కార్డులు లేవని, పెండింగ్లో ఉన్నాయని, కొందరికి ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవని, తమ చెంచుల నుండే ఆశ, అంగన్వాడి, ఏఎన్ఎం లాంటి వారిని నియమించాలని, ఎలాంటి నెట్ వర్క్ లేనందున అత్యవసర సమయాలలో సమాచారం చేరవేయడం కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేకుంటే ముఖ్యంగా ఆధార్, అప్డేషన్, కులము, పుట్టిన తేదీ ధ్రువపత్రాల వంటివి లేని కారణంగా నెల్లికల్ చెంచు వాని తాండ చెంచులు ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నారని తాండకు చెందిన ఆదెమ్మ ప్రజావాణిలో తన దృష్టికి తీసుకొచ్చిందని, సమస్యల పరిష్కారానికి చెంచులు నల్గొండకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో జిల్లా అధికారులందరిని తీసుకొని తానే శాసన సభ్యులతో సహా చెంచు తాండకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

అన్ని దృవపత్రాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, అందులో ఆధార్ ముఖ్యమని, ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం అవసరం ఉంటుందని, ముఖ్యంగా పెన్షన్లు పొందేవారు మూడు నెలలకు మించి పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదని, అలాగే భూమి సాగు చేసుకుంటున్న వారు భూమిని వదిలేసి వెళ్లకుండా నిరంతరం సాగు చేసుకుంటూ ఉండాలని ,అలాగే కొత్తగా అటవీ భూముల సాగు చేయొద్దని, ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అమలు చేస్తుందని,

చెంచులు ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను సద్విని చేసుకోవాలని,చెంచుతాండలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని, ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెన్షన్లు లేనివారు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని, ఆడ శిశువుల విక్రయాలు,బాల్య వివాహాల వంటి దూరాచారాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్య సేవలకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళవద్దని, ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, రోగం ముదిరాక ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ముందే రావాలని, తిరుమలగిరి సాగర్ లోనే డాక్టర్,గ్రామంలోనే ఆశ, అంగన్ వాడి ఉంటారని వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. తాండవాసుల కోరినట్లుగా తక్షణమే కమ్యూనికేషన్ కోసం ఎయిర్టెల్, లేదా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను ఏర్పాటు చేస్తామని, తండాలో గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి కేంద్ర ం ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, తండావవాసులందరికీ శాశ్వత ఆధార్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇదివరకే ఉన్న కార్డులలో తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు.

నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ చెంచు తండా ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు అధికారులు చెంచు తండాకే రావడం సంతోషమని, చెంచులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాగునీటి బోర్ మోటర్ మరమ్మతు చేయించాలని, అలాగే ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు.


Tags:    

Similar News