స్వగ్రామానికి విరాళంగా 11 ఎకరాల భూమి

దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

Update: 2025-11-23 12:29 GMT
TPCC Chief Mahesh Kumar Goud

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం స్వగ్రామమైన రహత్‌నగర్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాలను ఆయన విరాళంగా ఇచ్చారు.


ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎకరాభూమిని  విరాళంగా ఇచ్చారు.టెంపుల్ కారిడార్ ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేష్  ధన్యవాదాలు తెలిపారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ, ధర్మపురి దేవాలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి 380 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో పునర్నిర్మిస్తున్న దుర్గాదేవి  ఆలయం భూమిపూజలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.


తీపి గుర్తులు మర్చిపోలేను


బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను అని టీపీసీసీ చీఫ్ అన్నారు. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే తాను ఈ స్థాయికి వచ్చాను అని మహేష్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదన్నారు.  గ్రామంతో తన అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది అని ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామి ఇచ్చారు. గ్రామంలో  ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. గ్రామాభివృద్ధి  తన బాధ్యతగా భావిస్తున్నట్లు మహేష్ తెలిపారు. ఈ సందర్బంగా భారీ గజమాలతో గ్రామ ప్రజలు టీపీసీసీ అధ్యక్షుడిని సత్కరించారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడితో పాటు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News