ఆయుధాలు వీడటానికి సమయం కోరిన మావోయిస్ట్ పార్టీ..
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన తమ నిర్ణయాన్ని వెల్లడించిన మావోయిస్ట్‌లు.
అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్ట్‌లు ఆసక్తి చూపారు. తాము ఆయుధాలు వదిలేస్తామని, కానీ తమకు కొంత సమయం ఇవ్వాలని వారు కోరారు. ఆపరేషన్ కగార్ రోజురోజుకు వేగం పుంజుకుంటున్న క్రమంలో మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన ఓ లేఖ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నక్సలైట్లు ఆయుధాలు వీడాలన్న ప్రభుత్వాల పిలుపుకు తాజాగా వారు స్పందించారు. తమ సమాధానాన్ని చెప్తూ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. భద్రతా బలగాలు చేస్తున్న కూంబింగ్‌ను ఆపేస్తే ఆయుధాలు వీడటంపై ఈ విషయం వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు మూడు రాష్ట్రాల సీఎంలకు స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరి ఓ బహిరంగ లేఖ విడుదలయింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలు త్యజించి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తమ తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. కానా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని స్పష్టం చేశారు.
‘‘ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉంది. అందుకే ఈ నిర్ణయాన్ని సమిష్టిగా చేరుకోవడం కోసమే కొంత సమయం కోరుతున్నాం. మా సహచరులను సంప్రదించి పద్దతి ప్రకారం వారి సందేశాలను తెలియజేయడం కోసం కొంత సమయం కావాలి. అంతకుమించి సమయం కోరడానికి ఇతర ఉద్దేశాలేమీ లేవు. త్వరగా కమ్యూనికేట్ చేయడం కోసం మాకు వేరే మార్గాలు లేవు. అందుకే ఫిబ్రవరి వరకు టైమ్ కోరుతున్నాం. పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని లేఖలో పేర్కొన్నారు.