పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదానికి ఆరు కొత్త బిల్లులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నాయి. విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బిల్లుతో పాటుగా పౌర విమానయాన రంగంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలు కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ 2024ను కూడా ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బులటిన్‌లో ఈ బిల్లుల వివరాలను లోక్‌సభ సెక్రటేరియట్ పొందుపరిచింది.
జూలై 22 నుంచి సమావేశాలు..
వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే ఇతర బిల్లుల జాబితాలో స్వాతంత్ర్యానికి పూర్వం ముందు బాయిలర్స్ బిల్లు, కాఫీ (ప్రమోషన్, డెవలప్‌మెంట్) బిల్లు, రబ్బరు (ప్రమోషన్, డెవలప్‌మెంట్) బిల్లు ఉన్నాయి.
సభ్యులు వీరే..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి)ని ఏర్పాటు చేశారు. స్పీకర్ అధ్యక్షతన ఉన్న కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి), పిపి చౌదరి (బిజెపి), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), నిషికాంత్ దూబే (బిజెపి), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), సంజయ్ జైస్వాల్ (బిజెపి), దిలేశ్వర్ కమైత్ (జెడి- యు), భర్తృహరి మహతాబ్ (బిజెపి), దయానిధి మారన్ (డిఎంకె), బైజయంత్ పాండా (బిజెపి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బిజెపి) మరియు లాల్జీ వర్మ (ఎస్‌పి) సభ్యులుగా ఉన్నారు.