ఛత్తీస్‌గఢ్‌లో 36 మంది నక్సలైట్ల కాల్చివేత: దండకారణ్యం రక్తసిక్తం

ఛత్తీస్ గఢ్ బస్తర్ మరోసారి రక్తసిక్తమైంది. ఇప్పటికి 36మంది మావోయిస్టుల మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి

Update: 2024-10-05 01:18 GMT

దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది. మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. 36మంది నక్సలైట్లు ఎదురుకాల్పుల్లో చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నారాయణపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముందు ఏడుగురని చెప్పిన పోలీసులు ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోయారు. 36 మంది అంటే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడే ప్రమాదం ఉన్నందున చనిపోయిన వారి సంఖ్యను నెమ్మదిగా పెంచుకుంటూ పోయారని తెలుస్తోంది. ఎన్ కౌంటర్ తర్వాత తుపాకుల మోత ఆగిందని, అప్పుడు అడవిలోకి వెళ్లి చూస్తే వివిధ ప్రాంతాల్లో శవాలు కనిపించాయని, అందువల్లే చనిపోయిన వారి సంఖ్యను ఒక్కసారిగా చెప్పలేకపోయామని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఈ ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను అభినందించారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాల సాహసానికి తలవంచి శాల్యూట్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.


అక్టోబర్ 4, శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో నక్సలైట్లు తలపడినపుడు నక్సల్స్ మరణించారన పోలీసుల కథనం. కూంబింగ్ చేస్తుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారని, తిరిగి భద్రతా దళాలు కాల్పులు జరపడంతో వారు చనిపోయారన్నది పోలీసుల ప్రకటన. ఎన్ కౌంటర్లు జరిగిన ప్రతిసారీ పోలీసులు చెప్పే పాతకథే ఇప్పుడూ చెప్పారని పౌరహక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో...
నారాయణ్‌పూర్‌, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మొత్తం నక్సల్స్ సంఖ్య 36కి పెరిగింది. మరిన్ని ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం. సీఆర్పీఎఫ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. తుపాకుల మోత ఆగిన తర్వాత నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు.
“ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ ఎల్ ఆర్ (సెల్ఫ్-లోడింగ్ రైఫిల్) సహా ఆయుధాల డంప్ ను స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు చెప్పారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 185మంది హతం...
ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో భద్రతా బలగాలు 185 మంది నక్సల్స్‌ను హతమార్చాయి. శుక్రవారం నాటి ఎన్కౌంటర్ పై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ స్పందిస్తూ ఇది పెద్ద ఆపరేషన్ అంటూ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. "వారి పరాక్రమానికి తలవంచి నమస్కరిస్తున్నాను.. నక్సలిజం తుది శ్వాస తీసుకుంటోంది.. రాష్ట్రం నుంచి నక్సలిజం తరిమికొట్టడం ఖాయమన్నారు.
బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో భద్రతాదళాలు అక్టోబర్ 3 నుంచి కూంబింగ్ జరుపుతున్నాయి. నక్సలైట్ల శిబిరాన్ని భద్రతా బలగాలు కనిపెట్టి పెద్దఎత్తు పేలుడు పదార్థాలు, తర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్ 1న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు డర్ట్ ట్రాక్ కింద అమర్చిన మూడు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను (ఐఇడి) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన 53వ బెటాలియన్ సిబ్బంది కలిసి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు కస్తూర్‌మెటా-మొహంది గ్రామాల రహదారిలోని హోక్‌పాడ్ గ్రామ సమీపంలో ఒక్కొక్కటి 5 కిలోల బరువున్న ఐఇడిలు కనుగొన్నట్టు ఆ అధికారి తెలిపారు.
కాల్పుల్లో మరణించిన విజయవాడ వాసి...
ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కాయ్‌-6కు చెందిన శ్రేణులు మరణించినట్టు వార్తలందుతున్నాయి. వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్రకమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ కమలేశ్‌ అలియాస్‌ విష్ణు ఉన్నట్టు తెలుస్తోంది. 52ఏళ్ల నాగరాజు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి కీలకంగా పని చేస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే పలు దాడులు జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
నక్సలైట్ల శిబిరాన్ని గుర్తించిన తర్వాత భద్రతా దళాలు ఇచ్చిన సమాచారంతో నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌)కు చెందిన సంయుక్త బలగాలు అటవీ ప్రాంతానికి వెళ్లాయి. ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్‌తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించాయి.
నెందూర్‌-తుల్‌తులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. సాయంత్రానికి 14 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.
సంఘటన స్థలంలో 36మారణాయుధాలు దొరికాయి. వీటిలో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు ఉన్నాయి. ఎదురుకాల్పుల ఘటనను నారాయణ్‌పూర్‌ ఎస్పీ ప్రభాత్‌కుమార్‌ ధ్రువీకరించారు. దీనిపై బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఇరు జిల్లాల ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ భద్రతా దళాలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నక్సలైట్ల వేట ఇంకా కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ అమిత్ కుమార్ సెప్టెంబర్ 30న మాట్లాడుతూ నక్సలిజం ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌లోని రెండు లేదా మూడు జిల్లాలకే పరిమితమైందని, వచ్చే ఏడాదిన్నర కాలంలో వామపక్ష తీవ్రవాదం మాటే వినపడదన్నారు.ఆ మాట చెప్పిన నాలుగు రోజులకే మావోయిస్టులకు తీవ్ర విఘాతం ఎదురైంది. నక్సలైట్ ఉద్యమం చివరి దశలో ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఉన్నతాధికారి కుమార్ కూడా చెప్పారు. వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రాలుగా మారాయని పేర్కొన్నారు.
Tags:    

Similar News