ప్రియురాలి కోసం వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య!
ప్రియురాలి కోసం బెంగళూరు నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయనగరం జిల్లా తెర్లాం సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు.;
By : The Federal
Update: 2025-02-11 05:25 GMT
ప్రియురాలి కోసం బెంగళూరు నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయనగరం జిల్లా తెర్లాం సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఇంజినీర్ కులం కంటే ఆ అమ్మాయి కులం పెద్దది కావడమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పటికి అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం...
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) దారుణహత్యకు గురయ్యాడు. అతని పేరు కొనారి ప్రసాద్. వయసు 28 ఏళ్లు. ఈ యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్‌పై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసాద్ తలపై తీవ్ర గాయం కనిపిస్తోంది. శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి.
బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ప్రసాద్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణమైనట్టు భావిస్తున్నారు.
చేతికి అందివచ్చిన యువకుడు దారుణంగా హత్య కావడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.