ఆధార్‌ అప్‌డేట్‌ ఎందుకంటే..

ఆదార్‌లో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Update: 2024-05-28 10:12 GMT

ఆధార్‌ ప్రస్తుతం ఎంత అవసరమో మనకు తెలుసు. ప్రతి విషయంలోనూ మనిషికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆదార్‌ నెంబర్‌ అడుగుతున్నారు. వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఆధార్‌లో పొందుపరుస్తున్నారు. అందువల్ల ఏ సంస్థ అయినా ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపు కార్డుగా ఆధార్‌ను ఏర్పాటు చేసింది. ఆధార్‌లో నమోదు చేసే ప్రతి దానికి ఫ్రూఫ్‌ ఉండాల్సి ఉంటుంది. ఉదాహరణకు పుట్టిన తేదీ ఆధార్‌లో నమోదు కావాలంటే పదో తరగతి సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే తహసిల్దార్‌ కార్యాలయం నుంచి కానీ, మునిసిపల్‌ కార్యాలయం నుంచి కానీ పొందిన పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ను ఫ్రూఫ్‌గా చూపించాలి. ఇలా అడ్రస్‌ ఫ్రూఫ్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మార్పులు చేసుకునే ప్రతి దానికీ ఆధారం చూపించి మార్చుకోవచ్చు.

ఆధార్‌ ప్రారంభమై జూన్‌ 2024కు పది సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోకపోతే జూన్‌ 14, 2024లో అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 14లోపు అప్‌డేట్‌ చేసుకునే వారికి ఉచితంగా ప్రభుత్వం అప్‌డేట్‌ చేస్తుంది. ఈ తేదీని పొడిగిస్తారా? లేదా? అనే వివరాలు ఇంకా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇప్పటికే మూడో సారి తేదీని పొడిగించింది.
2024 జూన్‌ 14 తరువాత ఎవరైనా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంటే సొంతంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకున్నా, గుర్తింపు పొందిన ఆధార్‌ సెంటర్‌లలో అప్‌డేట్‌ చేసుకున్నా రూ. 50లు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలకు ఆధార్‌ నెంబరు కేటాయించే సమయంలో వారి వేలి ముద్రలు తీసుకోరు. తండ్రి లేదా తల్లి వేలిముద్రలు తీసుకుంటారు. పిల్లలు ఐదు నుంచి ఏడు సంవత్సరాల యవసులో ఉండగా వారిని ఆధార్‌ సెంటర్‌కు తీసుకెళ్లి బయోమెట్రిక్‌ చేయించాలి. వేలి ముద్రలు అప్పుడు పిల్లల పేరుతో అప్‌డేట్‌ అవుతాయి. ఆ తరువాత మరళా 15 నుంచి 17 సంవత్సరాల లోపులో ఒకసారి బయోమెట్రిక్‌ చేయించాల్సి ఉంటుంది.
ఆధార్‌ కార్డులో ఫోన్‌ నెంబరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆధార్‌ నెంబరు నుంచి ఎటువంటి సమాచారమైనా మెసేజ్‌ల ద్వారా ఫోన్‌కు వస్తుంది. అందువల్ల ఎప్పుడూ యాక్టివేషన్‌లో ఉండే ఫోన్‌ నెంబరును ఆధార్‌కు లింక్‌ చేయించడం మంచిది.
కొత్తగా పెళ్లయిన ఆడపిల్లల ఇంటి పేరు మార్చాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం అవుతుంది. ఆ సర్టిఫికెట్‌ హిందూ వివాహ చట్టం కానీ, క్రిష్టియన్‌ వివాహ చట్టం కింద కానీ, ముస్లిమ్‌ వివాహ చట్టం లేదా, ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్, ఇతర మైనార్టీల వివాహ చట్టాల కింద అయినా మ్యారేజ్‌ జరిగిన ప్పుడు అందుకు సంబంధించిన ఆథరైజ్‌డ్‌ పర్సన్స్‌ ఇచ్చిన సర్టిఫికెట్ల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. దానిని పరిగణలోకి తీసుకుని పేరులో మార్పులు చేస్తారు. ఇంటిపేరు ముందుకు మార్చాలన్నా, ముందు పేరు వచ్చి తర్వాత ఇంటి పేరు పెట్టాలన్నా దానికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధార్‌ సెంటర్‌లో అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం తీసుకుని పూర్తిచేసి గజిటెడ్‌ అధికారి సంతకం చేయించి తీసుకు రావాలి. అటువంటి వాటిని తీసుకుని అప్‌డేట్‌ చేస్తారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని పేరు మార్చుకున్నట్లైతే అందుకు సంబంధించిన గజిట్‌ నోటిఫికేషన్‌లో పొందు పరిచిన సర్టిఫికెట్‌ను అందించాలి.
సంక్షేమ పథకాల కోసం కొందరు పుట్టిన తేదీల్లో మార్పులు చేయించుకునేందుకు వస్తున్నారు. సంబంధిత వైద్యాధికారుల వద్ద సర్టిపికెట్‌ తెచ్చుకుంటున్నారు. వారు తెచ్చుకున్న వివరాల ప్రకారం బర్త్‌ సంవత్సరాలు మార్పు చేస్తారు. అలా మార్పు జరిగినప్పుడు ప్రభుత్వం సెక్రటేరియట్‌ నుంచి ప్రత్యేక అధికారులను పంపించి పథకం ప్రకటించిన తరువాత వయసు మార్చుకున్నరా? అంతకు ముందే మారిందా? అనే వివరాలు సేకరించి పథకం ప్రకటించిన తరువాత వయసు మార్చుకుని ఉంటే అటువంటి వారికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఆపివేస్తోంది. ఈ విషయాన్ని కూడా ఆధార్‌లో వయస్సు మార్చుకునే వారు గమనించాలని ఆధార్‌ సెంటర్‌ అధికారులు చెప్పారు.
ఆధార్‌కు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, బయో మెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవాలన్నా 1947 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కోవచ్చని విజయవాడలోని కార్వి ఆధార్‌ సెంటర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ జిఎ చక్రవర్తి ది ఫెడరల్‌ ప్రతినిధికి చెప్పారు.
Tags:    

Similar News