కొడుకు అరెస్ట్.. చంద్రబాబుపై జోగి రమేష్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది.

Update: 2024-08-13 07:24 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ కేసు విచారణలో ప్రాథమిక ఆధారాల ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ సహా మరో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఆ భూకబ్జాలకు సంబంధించే ఈరోజు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం సోదాలు ప్రారంభించారు. ఫైళ్లను కూడా పరిశీలించారు. అనంతరం జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అంబాపురం భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు విచారణలో భాగంగానే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో జోగి రాజీవ్ ఏ1గా ఉండగా, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఏ2గా ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజీవ్‌ను గొల్లపూడి కార్యాలయానికి తరలించారు అధికారులు. ఆయనకు పలు అంశాలకు సంబంధించి విచారించనున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలపై, తన కుమారుడి అరెస్ట్‌పై జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై మండిపడ్డారు. కూటమి కుట్రలకు ఈ సోదాలే నిదర్శనమని, ఈ చర్యలతో చంద్రబాబు మరోసారి తన వంకర బుద్ది చూపుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తమపై ఏసీబీ సోదాలు, తన కుమారిడిని అదుపులోకి తీసుకోవడం అంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార రాజకీయాల్లో భాగమేనని జోగి రమేష్ విమర్శించారు. ‘‘అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసిందని నిరూపిస్తే విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధంపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు రాజీవ్ విదేశాల్లో ఉన్నతవిద్యలు చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై చంద్రబాబు చేయిస్తున్న దాడి ఇది. గౌడ కులం నుంచి వచ్చినా అంచెలంచెలుగా ఎదిగాను. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదు’’ అని అన్నారు మాజీ మంత్రి.

ఇది బలహీన వర్గాలపై దాడే

అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఈ విపక్ష నేత. ‘‘చంద్రబాబు నీకూ కొడుకులు ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించడం ఎవరికీ మంచిది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు తన వంకర బుద్ది మార్చుకుంటే మంచిది. ఈరోజు జరిగిన ఏసీబీ దాడులు జోగి రమేష్, రాజీవ్‌పై జరిగినవి కావు.. బలహీన వర్గాలపై జరిగిన దాడులు. చంద్రబాబు ప్రతీకారాలు పక్కనపెట్టి ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చండి. ప్రజల దృష్టిని హామీలపై నుంచి మళ్లించడానికే చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి’’ అని హితవుపలికారు.

మా నన్న కక్షతోనే నా అరెస్ట్

తన తండ్రి జోగి రమేష్‌పై ఉన్న కక్ష కారణంగానే ఈరోజు తనను అరెస్ట్ చేశారంటూ జోగి రాజీవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ కబ్జాలు, మోసాలు చేయలేదన్నారు. అందరి తరహాలోనే భూములు కొనుగోలు చేయడం కూడా తప్పా అని అన్నారు. ‘‘అందరిలాగే మేము కూడా భూములు కొన్నాం. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటాం. మాపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’’ అని ఆరోపించారు. మరోవైపు ఇదే విషక్ష్ంపై మాట్లాడిన జోగి రమేష్.. అగ్రిగోల్డ్ భూములు అప్పటికే అటాచ్‌ చేయబడ్డాయని, అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News